గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి… తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది.ఇందులో వ్యక్తులు చేసిన పాపాలకు గాను నరకంలో విధించే శిక్షల వివరాలు ఉంటాయి.
ఇవిచేయకూడదా..?
కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి… బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది.
అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట.
తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు.
ఈ క్రమంలోనే అసలు ఎవరు ఎలాంటి పాపం చేస్తే వారికి ఎలాంటి శిక్షలు పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- మద్యం సేవించే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి చేత ద్రవ రూపంలో ఉన్న వేడి ఇనుమును తాగిస్తారట.
- ఆడ, మగ ఎవరైనా ఒకరు ఇంకొకరిని లైంగికంగా వేధించినా, అత్యాచారం చేసినా నరకంలో వారి జననావయవాలను కత్తిరిస్తారు.
- జంతులను చంపే వారికి కూడా నరకంలో శిక్షలు పడతాయి. వారిని జంతులను నరికినట్టే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెడతారట.
- పేదలకు అన్నం పెట్టకుండా తామే తినే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది. వారి శరీరాన్ని పక్షులకు ఆహారంగా వేస్తారు.
- తమ సంతోషం కోసం జంతువులను హింసిస్తూ వేడుక చూసే వారికి, అలా వాటిని చంపే వారికి నరకంలో శిక్ష పడుతుంది. వారిని సల సల కాగే నూనెలో ఫ్రై అయ్యేలా వేయిస్తారట.
- పెద్దలకు గౌరవం ఇవ్వని వారికి, వారిని నిర్లక్ష్యం చేసే వారికి కూడా నరకంలో శిక్ష ఉంటుంది. వారిని బాగా వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచుతారు. ఆ బాధకు తట్టుకోకున్నా సరే అందులో ఉండాల్సిందే.
- ఇతరులకు సహాయం చేయని వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారి ఎత్తయిన లోయలోంచి కిందకు విసిరేస్తారు. అక్కడ ప్రమాదకరమైన పాములు, తేళ్లు వంటి విష పురుగులతో కుట్టిస్తారు. ఆ తరువాత క్రూర జంతువులతో హింసిస్తారు.
- ఎప్పుడూ ఇతరులను మోసం చేసే వారిని, అబద్దాలు ఆడే వారిని, తిట్టే వారిని నరకంలో శిక్షిస్తారు. వారిని అక్కడ తలకిందులుగా వేలాడదీసి క్రూరమైన జంతువులచే హింసింపజేస్తారు.
- ప్రజలను సరిగ్గా పాలించకుండా, వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి నరకంలో దారుణమైన శిక్ష వేస్తారు. వారి శరీరాలను పిప్పి పిప్పి చేస్తారు. అంతకు ముందు దారుణంగా కొడతారు. ఆ తరువాత శరీరాలను రోడ్డు రోలర్ కింద వేసి నలిపినట్టు నలిపేస్తారు.
- ప్రజల ధనం, వస్తువులు దోపిడీ చేసే వారికి నరకంలో ఎలాంటి శిక్ష పడుతుందంటే వారిని యమభటులు తాళ్లతో దారుణంగా కట్టేసి రక్తం వచ్చే వరకు కొడతారు. రక్తాలు కారుతున్నప్పటికీ కొట్టడం ఆపరు. వారు పడిపోయే వరకు అలా కొడుతూనే ఉంటారు.
- అధికార దుర్వినియోగానికి పాల్పడే వారికి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు పనులు చేసే వారికి నరకంలో శిక్ష ఉంటుంది. వారిని మానవుని వ్యర్థాలతో కూడిన నదిలో పారేస్తారు. అందులో మానవులకు చెందిన మలం, మూత్రం, ఇతర వ్యర్థాలు ఉంటాయి. వాటిని తాగుతూ వారు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.