మహా కుంభమేళా ప్రారంభం అవ్వడానికి చాలా తక్కువ సమయమే ఉంది. ఈ కుంభమేళా 45 రోజులు పాటు జరుగుతుంది. దీనికోసం మన దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తారు. అయితే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. అంతేకాక ఈ కుంభమేళాను ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోనే నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా కుంభమేళాను 12 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తారు, కానీ మహా కుంభమేళా ను 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మహా కుంభమేళా అనేది ప్రారంభమవుతుంది.
భూమి పైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం అని హిందూ గ్రంధాలు చెబుతున్నాయి. దాని ప్రకారం చూస్తే దేవతలు రాక్షసులు మధ్య 12 ఏళ్ల పాటుగా యుద్ధం జరిగింది. అయితే దీని వలన 12 ఏళ్లకు ఒకసారి పూర్ణకుంభమేళాగా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలు అయింది అంటే భూమి పైన 144 సంవత్సరాలు అయినట్లు, అందుకే 144 ఏళ్లకు ఒకసారి మహా కుంభమేళాను నిర్వహించడం జరుగుతుంది. కేవలం ప్రయాగ్రాజ్ లోనే ఎందుకు నిర్వహిస్తారంటే ప్రయాగ్రాజ్ లో గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం కావడం తో మహా కుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు.
ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్ లోని గంగా నది, నాసిక్ లోని గోదావరి నది, ఉజ్జయినిలోని సిప్రా నదిలో కూడా కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో ఆ నదుల్లో పుణ్యస్నానం చేయడం వలన మోక్షాన్ని పొందవచ్చు అని హిందువులు నమ్ముతారు. ఈ సంవత్సరం జనవరి 13వ తేదీన మొదటి రాచస్నానం చేస్తారు, జనవరి 14న రెండో రాచస్నానం, మూడవ రాచస్నానం జనవరి 29వ తేదీన, ఫిబ్రవరి 3వ తేదీన 4వ రాచస్నానం, ఫిబ్రవరి 12వ తేదీన 5వ మరియు చివరిగా ఆరవ రాచస్నానం కుంభమేళా ముగిసిన రోజున అంటే ఫిబ్రవరి 26వ తేదీన శివరాత్రి రోజున నిర్వహించడం జరుగుతుంది.