జగన్నాథుడు పూరీలో ఎలా వెలిశాడు.. ఆలయం చరిత్ర తెలుసుకోండి..!

-

జగన్నాథుడు పూరీలో ఎందుకు వెలిశాడు. ఎలా వెలిసాడు. అక్కడి విశిష్టత ఏంది? అసలు.. పూరీ జగన్నాథ్ ఆలయం చరిత్ర ఏంటి? తెలుసుకోవాలంటే ప్రాచుర్యంలో ఉన్న ఓ కథ గురించి మనం తెలుసుకోవాల్సిందే.

పూర్వం ద్వాప‌ర‌ యుగంలో మన దేశాన్ని ఇంద్రద్యుమ్న అనే మహారాజు పాలించేవాడు. ఆయన విష్ణు భక్తుడు. ఓసారి విష్ణువు ఇంద్రద్యుమ్న కలలో కనిపించి.. తన కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించాడు. దీంతో మహావిష్ణువు ఆదేశాన్ని మహాద్భాగ్యగా స్వీకరించిన ఇంద్రద్యుమ్న.. వెంటనే ఆయన నిర్మాణాన్ని పూరీలో ప్రారంభించాడు. నిర్మాణం జరుగుతోంది కానీ.. ప్రతిష్ఠామూర్తుల రూపాలు ఎలా ఉండాలనే దానిపై కాస్త సందిగ్దానికి గురయ్యాడు. విష్ణువు రూపం తనకు కలలో కనిపించింది కానీ.. దాన్ని శిల్పంగా ఎలా మలచాలనే ఆవేదనతో ఉన్నాడు.

దీంతో… ఇంద్రద్యుమ్న పడుతున్న ఆవేదనను గమనించిన మహా విష్ణువు.. తనే ఓ శిల్పాచార్యుడిగా రూపం దాల్చాడు. ఇంద్రద్యుమ్న మహారాజు వద్దకు వెళ్లి.. మహారాజా.. మీకు సంతృప్తి కలిగే విధంగా మూలవిరాట్టు నిర్మాణాన్ని నేను చేస్తాను.. కాకపోతే ఒక షరతు.. నా పని పూర్తయ్యే వరకు ఎవరూ నా గదిలోని ప్రవేశించకూడదు. నా అంతట నేనే బయటికి వచ్చేవరకు నా పనికి ఎవ్వరూ అంతరాయం కలిగించరాదు.. అని నిబంధనలు పెడుతాడు.

మహారాజు వాటికి సమ్మతించి వెంటనే పని ప్రారంభించాలని చెబుతాడు. వెంటనే ఓ ఏకాంత మందిరంలో మహావిష్ణువు రూపంలో ఉన్న శిల్పాచార్యుడు శిలను చెక్కడం ప్రారంభిస్తాడు. నెలలు గడిచినా.. ఆ శిల్పి మందిరంలోనుంచి బయటికి రాడు. కాకపోతే లోపల మాత్రం శబ్దాలు వస్తుండేవి. ఎప్పుడెప్పుడు మూలవిరాట్టు రూపాన్ని చూడాలని ఆతృతతో ఎదురు చూస్తుంటాడు మహారాజు. కొన్ని రోజుల తర్వాత ఆ మందిరంలోనుంచి శబ్దాలు రావడం మానేస్తాయి. దీంతో ఏం జరిగిందోనని అనుమానంతో పాటు ఆతృత కూడా ఎక్కువైంది. ఒకవేళ నిద్రాహారాలు మాని శిల్పాన్ని చెక్కిన శిల్పి మరణించి ఉంటాడా అన్న అనుమానం కలిగింది మహారాజుకు.


దీంతో.. శిల్పి చెప్పిన నిబంధనకు కూడా వదిలేసి.. వెంటనే ఏకాంత మందిరం తలుపులు తెరుస్తాడు రాజు. వారు మందిరంలోకి ప్రవేశించగానే తన ఏకాంతానికి భంగం కలిగిందని భావించిన శిల్పి తక్షణమే మాయమవుతాడు. అయితే.. అక్కడ చెక్కి ఉన్న మూలవిరాట్టు విగ్రహాలను చూసి రాజు ఆశ్చర్యపోతాడు. కరచరణాలు లేకుండా.. ఆ విగ్రహాలు మొండిగా ఉంటాయి. వీటిని ఆలయంలో ఎలా ప్రతిష్ఠించాలన్న సందిగ్దంలో రాజు పడతాడు.

అయితే.. ఆ రోజు రాత్రి మహావిష్ణువు మళ్లీ ఇంద్రద్యుమ్న కలలో కనిపించి.. మహారాజా.. బాధ పడకు. ఇది నా సంకల్పమే. ఆ శిల్పి ఎంత వరకు చెక్కాడో… ఆ శిల్పాలనే ఆలయంలో ప్రతిష్ఠించు. నేను ఆ రూపాలతోనే కొలువు తీరుతాను. జగన్నాథుడిగా పేరొందుతాను.. అని చెబుతాడు మహావిష్ణువు. దీంతో ఆ మూల విరాట్ మూర్తులనే రాజు ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ.. అలాగే ఆ మూల విరాట్టు విగ్రహాలు జగన్నాథ్ లో పూజింపబడుతున్నాయి. పూరీలో రాజు ఆ ఆలయాన్ని నిర్మించడం వల్ల ఆ ఆలయానికి పూరీ జగన్నాథ్ ఆలయం అని పేరు వచ్చింది. ఇది పూరీ జగన్నాథుడు వెలిసిన చరిత్ర.

Read more RELATED
Recommended to you

Latest news