కరోనా దెబ్బ భద్రాద్రి రాముడికి కూడా తగిలింది. రాముల వారి కల్యాణానికి ఎవరూ రావొద్దని లైవ్ లో చూపిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో పూజారులే రాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. కళ్యాణం కనులారా వేక్షించాలి అని కోట్లాది మంది భక్తులు భద్రాద్రి వెళ్తూ ఉంటారు. రాముల వారి దర్శనం దక్కితే చాలు అనుకునే భక్తులు ఎందరో ఉన్నారు. అలాంటి రాముల వారి దర్శనం ఈ ఏడాది ఎవరికి లేదు.
కరోనా మహమ్మారి కారణంగా దేవాలయాల్లోని అన్ని కైంకర్యాల మాదిరిగానే రాములోరి కళ్యాణాన్ని కూడా ఏకాంతంగానే నిర్వహిస్తామని భద్రాద్రి ఆలయ అధికారులు కీలక ప్రకటన చేయడమే కాకుండా రాములవారి దర్శనం కోసం ఎవరూ రావొద్దని కోరడం గమనార్హం. టీవీల్లోనే రాములవారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాలని విజ్ఞప్తి చేసారు. దేవస్థానం చరిత్రలో తొలిసారి కళ్యాణాన్ని ఆలయంలోని నిత్య కళ్యాణ మండపం వద్ద నిర్వహిస్తున్నారు.
రాములవారి ఆలయం నిర్మాణం చేపట్టిన 350 ఏళ్ళలో భక్తుల భాగస్వామ్యం లేకుండా ఏనాడు ఈ విధంగా కళ్యాణం జరగలేదని ఆధ్యాత్మికవేత్తలు, రాముల వారి దేవాలయ చరిత్ర తెలిసిన వారు చెప్పే మాట. రామయ్య కళ్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకాన్ని పురస్కరించుకుని దేవస్థానం అధికారులు సుమారు రూ. 3 లక్షలతో కళ్యాణ మండపాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.