శ్రీవారికి ఆస్థానం జరిగేటప్పుడు ప్రతిరోజు ఉదయం సుప్రభాతం, విశ్వరూపదర్శనం, తోమాలసేవానంతరం స్నపనమండపంలో శ్రీవేంకటేశ్వరస్వామి (కొలువుమూర్తి) ఛత్రచామరమర్యాదలతో, బంగారుసింహాసనంపై కొలువుదీరగా, దేవస్థానం వారు స్వామివారికి పంచాంగశ్రవణం చేయిస్తారు. ఆనాటి తిథి, వార, నక్షత్ర విశేషాలతోపాటు ఉత్సవ విశేషాలు స్వామివారికి వినిపిస్తారు.
అంతేగాక ముందునాటి ఆదాయాన్నీ బంగారం, వెండి, నగలు, పాత్రలు మున్నగు సమస్త వస్తువుల విలువను లెక్కలుగట్టి మొత్తం నికరాదాయాన్ని పైసల వరకు కూడ శ్రీస్వామివారికి అత్యంత భక్తిప్రపత్తులతో చదివి వినిపిస్తారు. ముందునాడు దర్శనం చేసుకొన్న భక్తులసంఖ్యను కూడ తెలపడం జరుగుతుంది. ఈ విన్నపాలను కొలువుదీరి ఉన్న శ్రీస్వామివారు మహాదర్చంగా ఆలకించి, ఆనందిస్తూ, భక్తులను అనుగ్రహిస్తూంటాడు. ఇది ప్రతినిత్యం జరిగే శ్రీవారి ఆస్థాన విశేషాలు. ఆయా పండుగల సందర్భాలలో ప్రత్యేక ఆస్థానాలు జరుగుతాయి. వాటిలో ఉగాది, దీపావళి ఆస్థానాలు ప్రత్యేకమైనవి.
– శ్రీ