హ‌త్య కేసు నిందితుల అరెస్టు

  • ఆర్ధిక లావాదేవీల హ‌త్య‌కు కార‌ణం
  • వివ‌రాలు వెల్ల‌డించిన సీపీ త‌రుణ్‌జోషివ‌రంగ‌ల్‌, జ‌న‌వ‌రి 6 : గత సంవత్సరం నవంబర్ 21 రాత్రి మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూపకుంట రోడ్డులో జరిగిన హత్యకు సంబందించి బాధ్యులైన ఆరుగురు నిందితులను మీల్స్ కాలనీ పోలీసులు గురువారం అరెస్టు చేసారు. నిందితుల నుండి హతుడికి సంబంధించిన ఒక బంగారు బ్రాస్లెట్, రెండు బంగారు ఉంగార‌లు ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
    పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1. బైరి గురుమూర్తి, తండ్రి పేరు వెంకటస్వామి, వయస్సు 49, రంగశాయిపేట, వరంగల్. 2.నీలం శ్రీనివాస్, తండ్రి పేరు మల్లేషం, వయస్సు 32, శివనగర్, వరంగల్. 3.అకునూరి మహరాజ్ (చనిపోయాడు), తండ్రి పేరు సాంబయ్య, వయస్సు 30, శివనగర్, వరంగల్. 4.గనిపాక నాగరాజు, తండ్రి పేరు బాబు, వయస్సు 33, వసంతాపూర్, వరంగల్. 5. జన్ను కళ్యాణ్, తండ్రి పేరు రమేష్, వయస్సు 21,దూబకుంట, వరంగల్. 6. సింగారపు రాజ్ కుమార్,తండ్రి పేరు సాంబయ్య,వయస్సు 25, వసంతాపూర్, వరంగల్. 7. యం.డి గుంశావలీ ఆలియాస్ గుమ్ము, తండ్రి పేరు పాషా, శంభునిపేట, వరంగల్ ఉన్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి వివరాలను వెల్ల‌డించారు.

ప్రధాన నిందితుడైన బైరి గురుమూర్తి గతంలో హతుడు కోక వేంకటేశ్వర్ రావుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించాడు. ఈ పరిచయంతో గురుముర్తి తన పెద్ద కుమార్తె వివాహం కోసం తన స్వంత ఇంటికి సంబంధించిన దస్తావేజులను హతుడు వెంకటేశ్వర్లరావు వద్ద తనాఖా పెట్టి 5 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. దీంతో పాటు నిందితుడికి మ‌రిన్ని అప్పులు కావడంతో, రెండో కుమార్తెకు కాలేజీ ఫీజులు చెల్లించాల్సి వుండటంతో పాటు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన స్వంత ఇంటిని 58 లక్షలకు అమ్మేందుకు ఒక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు 15 లక్షల రూపాయలను అడ్వాస్సుగా తీసుకున్నాడు. ఇందుకుగాను నిందితుడు గురుమూర్తి తన ఇంటి దస్తావేజుల కోసం హతుడు వేంకటేశ్వర్ రావును సంప్రదించగా తీసుకున్న డబ్బుకు మొత్తం వడ్డీ చెల్లిస్తేనే దస్తావేజులు తిరిగి ఇస్తానని నిందితుడుని ఇబ్బందుకు గురిచేయడంతో హతుడిపై ద్వేషం పెంచుకున్నాడు. ఇది ఇలా వుండగా హతుడు వేంకటేశ్వర్ రావు ఇంటిలో కిరాయి ఉంటున్న మరో నిందితుడు నీలం శ్రీనివాస్ కు వేంకటేశ్వర్ రావు మధ్య ఆర్థిక లావాదేవీల గొడవ కారణంగా నీలం శ్రీనివాస్ కు సంబంధించిన ఇంటి సామాను వెంకటేశ్వర్లు తన ఇంటిలో ఉంచుకుని తాళం వేసుకోవడంతో, శ్రీనివాస్ భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ సైతం వెంకటేశ్వర్లరావుపై ద్వేషం పెంచుకున్నాడు.

ఇదే సమయంలో ప్రధాన నిందితుడు గురుమూర్తి, మరోనిందితుడు నీలం శ్రీనివాస్‌ కు మద్య పరిచయం ఏర్ప‌డింది. ఇరువురు వెంకటేశ్వర్లరావుతో వున్న ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడ‌వలు ఉండటంతో వెంకటేశ్వర్ల రావును నీలం శ్రీనివాస్ ముందుగా మరో నిందితుడు ఆకునూరి మహరాజ్ (చనిపోయాడు)తో బెదించాలని చూశాడు. కానీ వేంకటేశ్వర్లరావుని చంపడం ద్వారా మన ఇరువురికి అతనితో వున్న ఆర్థిక లావాదేవీలు పూర్తిగా సమసిపోతాయని ప్రధాన నిందితుడు గురుమూర్తి తెలపడంతో ఇందుకు అంగీకరించిన శ్రీనివాస్, వేంకటేశ్వర్ రావును హత్య చేసేందుకు అవసరమైన డబ్బును నేను ఖర్చు చేస్తానని అంగీకరించాడు నిందితుడు గురుమూర్తి. వేంకటేశ్వర్ రావును హత్య చేసేందుకుగాను నిందితుడు ఆకునూరి మహరాజ్ ద్వారా మిగితా నిందితులతో గురుమూర్తి, శ్రీనివాస్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు. హత్యలో భాగంగా ఫైనాన్స్ చేసిన డబ్బులు రోజు వారీ వసూళ్ళ కోసం దూపకుంట రోడ్డు మార్గానికి – వస్తున్నట్లుగా గుర్తించి వెంకటేశ్వర్ రావు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తూర్పుకోటకు వెళ్ళే మార్గంలోని తాటివనంలో హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

పథకం ప్రకారం గత నవంబర్ 21వ తేదీన రాత్రి సుమారు 8గంటల సమయంలో నిందితుల్లో ఒకడైన నీలం శ్రీనివాస్ హతుడు వేంకటేశ్వర్ రావు ద్విచక్ర వాహనంపై ఎక్కి తూర్పుకోట మార్గంలోని తాటి వనం వైపు మభ్యపెట్టి తీసుకువ‌చ్చాడు. అప్పటికే అక్కడ ఆటోలో కాపుకాస్తున్న ప్రధాన నిందితుడు గురుమూర్తితో సహ మిగితా నిందితులు ద్విచక్రవాహనం నడుపుతున్న హతుడు వేంకటేశ్వర్ రావు మీదపడి పిడి గుద్దుల‌తో పాటు, నిందితుల్లో ఒకడైన గనిపాక నాగరాజు వెంకటేశ్వర్ణరావు మెడను తన చేతులతో విరవడంతో మృతి చెందాడు. వెంకటేశ్వర్లు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పాటు సెల్ ఫోన్, మృతుడి జేబులో పదివేల రూపాయలను నిందితులు దొపిడీ చేసారు. హత్య జరిగిన మరుసటి రోజు హతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి సూచనల మేరకు వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్‌ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్ తమ సిబ్బందితో కల్సి వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహించి ఈ హత్యకు పాల్పడిన అసలైన నిందితులను గుర్తించారు. గురువారం ఉదయం ఆర్థిక లావాదేవీలకు సంబందించి చర్చించేందుకుగాను నిందితులంద‌రూ రంగశాయిపేట్ వాటర్ ట్యాంక్ వద్దకు వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ తన సిబ్బందితో వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన హత్యను పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ హత్య కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పా రెడ్డి, వరంగల్ ఏసీపీ గిరికుమార్, మీల్స్ కాలనీ ఇన్ స్పెక్టర్ ముస్కా శ్రీనివాస్, సైబర్ క్రైం ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, మీల్స్ కాలనీ ఎస్.ఐ రాజేందర్, ఏ.ఏ.ఓలు ప్రశాంత్, సల్మాన్ పాషా , మీల్స్ కాలనీ,కేయు కానిస్టేబుళ్ళు వీరన్న, మధులను పోలీస్ కమిషనర్ అభినందించారు.