ఎన్నో వేల ఏళ్ల నుంచి మన సమాజంలో స్త్రీల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ ఆధునిక యుగంలోనూ స్త్రీలకు సమానమైన అవకాశాలు లభించడం లేదు. పురుషులకు దీటుగా వారు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ వారికి ఇంకా అనేక రంగాల్లో అవకాశాలు సరిగ్గా లభ్యం కావడం లేదు. అయితే ఇటీవల ముగ్గురు మహిళా జడ్జిలు సుప్రీం కోర్టు జడ్జిలుగా నియామకం అయిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ కూడా పైన చెప్పిన విషయాన్నే వెల్లడించారు. మహిళలకు ఇంకా అనేక రంగాల్లో అవకాశాలను కల్పించాలని అన్నారు.
సెస్టెంబర్ 1వ తేదీన జస్టిస్‌లు హిమా కోహ్లి, బేల ఎం.త్రివేది, బీవీ నాగరత్నలు సుప్రీం కోర్టు జడ్జిలుగా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ ఇది చారిత్రాత్మక ఘట్టం అయినప్పటికీ సుప్రీం కోర్టులో మహిళా జడ్జిల సంఖ్య ఇంకా పెరగాలని అన్నారు. 1950లో సుప్రీం కోర్టును ఏర్పాటు చేశాక 39 ఏళ్లకు తొలిసారిగా 1989లో జస్టిస్ ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు మహిళా జడ్జి అయ్యారు. అయితే గత 71 ఏళ్లుగా 256 మంది సుప్రీం కోర్టు జడ్జిలుగా నియామకం అయ్యారు. వారిలో కేవలం 11 మంది మాత్రమే మహిళా జడ్జిలు కావడం గమనార్హం. అందువల్ల సుప్రీం కోర్టులో మహిళా జడ్జిలు నియామకం అయినప్పటికీ వారి సంఖ్య చాలదని, ఆ విషయంలో మహిళలు వెనుకబడే ఉన్నారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిల సంఖ్య 34 ఉండగా వారిలో 4 మంది మహిళలే. అయితే జస్టిస్ బీవీ నాగరత్న కొన్నేళ్లకు చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2027లో ఆమెకు అవకాశం దక్కనుంది. కానీ అప్పటికి ఆమె రిటైర్మెంట్ వచ్చేస్తోంది. కేవలం ఒక నెల రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉంటారు. అందువల్ల ఆమె మహిళల కోసం ఎక్కువ పనిచేసే అవకాశం లేదు. ఇది చాలా మందిని అసంతృప్తికి గురి చేస్తోంది.
విదేశాల్లో కోర్టులలో మహిళా జడ్జిల సంఖ్య ఎక్కువే. యూకేలోని కోర్టులలో 32 శాతం మంది మహిళా జడ్జిలు ఉండగా, అమెరికాలో 34 శాతం మంది ఉన్నారు. ఇంటర్నేషనల్ కోర్టులో 15-20 శాతం మంది ఉన్నారు. కానీ మన దేశంలో వారి సంఖ్య 4.2 శాతం మాత్రమే ఉంది. అంటే న్యాయవ్యవస్థలో మహిళలపై ఇంకా వివక్ష ఉన్నదనే అర్థమవుతుంది. అందువల్ల సుప్రీంలో ముగ్గురు మహిళలు జడ్జిలుగా నియామకం అయ్యారని ఇప్పుడే సంబర పడాల్సిన అవసరం లేదని, వారి సంఖ్య పెరిగితేనే సంతోష పడాలని నిపుణులు అంటున్నారు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.