కరోనా మహమ్మారికి కేంద్ర బిందువైన చైనాకు గట్టి షాక్ తగిలింది. వైరస్‌ను బయటకు వదలడమే కాకుండా.. తాము ఆ పనిచేయలేని డ్రామాలు ఆడుతున్న డ్రాగన్ దేశానికి చెంప పగిలేలా కంపెనీలు సమాధానం ఇస్తున్నాయి. ఇకపై అక్కడ ఏమాత్రం కార్యకలాపాలను నిర్వహించేది లేదని తెగేసి చెబుతున్నాయి. అందులో భాగంగానే విదేశాలకు చెందిన సుమారు 1000 వరకు కంపెనీలు ఇప్పుడు చైనా నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అక్కడ ఉన్న తమ పరిశ్రమలు, కార్యాలయాలను మూసేసి తమ సొంత దేశాల్లో లేదా ఇతర అనుకూల దేశాల్లో వాటిని నెలకొల్పాలని అనేక సంస్థలు ప్రయత్నాలను ప్రారంభించాయి.
చైనాలో మొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్, సింథటిక్ ఫ్యాబ్రిక్స్, మెడికల్ పరికరాలు, టెక్స్‌టైల్ రంగానికి చెందిన అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ క్రమంలో చైనా ఆయా పరిశ్రమలకు ఉత్పత్తి కేంద్రంగా కూడా ఉంది. ఇక అమెరికా, జర్మనీతోపాటు పలు ఇతర దేశాలకు చెందిన పరిశ్రమలు, కార్యాలయాలు కూడా చైనా కేంద్రంగా కీలక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ఆయా సంస్థలు చైనా నుంచి వెనక్కి వచ్చేయాలని చూస్తున్నాయి. అందుకు గాను ఆయా సంస్థలకు చెందిన మాతృదేశాలు వాటికి అవసరమైన ప్యాకేజీలను కూడా అందిస్తున్నాయి. దీంతో మొత్తం 1000కి పైగా కంపెనీలు చైనా నుంచి శాశ్వతంగా బయటకు రావాలని చూస్తున్నాయి. అయితే వాటిలో కనీసం 300 కంపెనీలనైనా భారత్‌కు రప్పించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
చైనా నుంచి తరలిపోయే పరిశ్రమలను భారత్‌కు రప్పించేందుకు గాను కేంద్రం ఇప్పటికే పలు చర్యలను తీసుకోవడం ప్రారంభించింది. పరిశ్రమలకు కావల్సిన స్థలాలను ఎంపిక చేయడంతోపాటు వాటికి త్వరగా అనుమతులు ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అలాగే కంపెనీలపై విధించే పన్నును కూడా తక్కువగా వసూలు చేయాలని చూస్తున్నారు. దీంతో విదేశీ కంపెనీలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. అయితే ఎన్ని కంపెనీలు చైనా నుంచి భారత్‌కు వస్తాయనేది మాత్రం.. కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది..!