ఓ వైపు ప్రైవేటు టెలికాం కంపెనీలు చాలా వేగంగా 4జీని విస్తరించుకుంటూ పోతుంటే మరో వైపు బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండడం వినియోగదారులకు చిరాకును పుట్టిస్తోంది.
మన దేశంలో ఓ వైపు ప్రైవేటు టెలికాం కంపెనీలు లాభాల మీద లాభాలు ఆర్జిస్తుంటే మరో వైపు ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ మాత్రం నష్టాల బాటలో ప్రయాణం చేస్తోంది. ఇతర టెలికాం కంపెనీలతో పోటీ పడి బీఎస్ఎన్ఎల్ సేవలు అందించలేకపోతోంది. ఈ క్రమంలో ఆ నెట్‌వర్క్‌ను వాడుతున్న వినియోగదారుల సంఖ్య కూడా ఏటా తగ్గుతూ వస్తోంది. అయితే ఇకపై బీఎస్ఎన్ఎల్ మనుగడ మరింత కష్టం కానుందని, త్వరలో ఆ సంస్థ మూత పడవచ్చని కూడా తెలుస్తోంది.
బీఎస్ఎన్ఎల్ కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాలు అందించే స్థితిలో కూడా కంపెనీ లేదని ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ఇటీవలే తెలియజేసింది. బీఎస్ఎన్ఎల్ కు రూ.13వేల కోట్ల అప్పులుండగా వీలైనంత త్వరగా నిధులు అందజేసి సంస్థను ఆదుకోవాలని ఆ సంస్థ కోరుతోంది. ప్రస్తుతం వస్తున్న ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువగా ఉంటోందని, ఈ క్రమంలో తక్షణమే నిధులు సాయం చేయకపోతే సంస్థ కార్యకలాపాలు కొనసాగించడం దాదాపుగా కష్టమేనని బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ బడ్జెట్ అండ్ బ్యాంకింగ్ డివిజన్ సీనియర్ జనరల్ మేనేజర్ పురాన్ చంద్ర స్పష్టం చేశారు. కాగా ఈ విషయమై ఆయన టెలికాం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా బీఎస్ఎన్ఎల్ కు నిధులు అందజేయాలని లేఖలో కోరారు.
కాగా కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక ప్రకారం ఎక్కువ నష్టాలు నమోదు చేసుకుంటున్న ప్రభుత్వ రంగ కంపెనీల జాబితాలో బీఎస్ఎన్ఎల్ మొదటి స్థానంలో ఉంది. 2018 డిసెంబర్ నాటికే ఈ కంపెనీ నిర్వహణ నష్టాలు ఏకంగా రూ.90వేల కోట్లు దాటినట్లు నిర్దారించారు. అయితే నిజానికి బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగి వ్యయాలు ఎక్కువవుతుండడం, బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, 4జీ నెట్‌వర్క్ విస్తరణలో జరుగుతున్న జాప్యం.. వంటి అంశాల కారణంగా ఆ సంస్థ వైపు కేంద్రం చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఓ వైపు ప్రైవేటు టెలికాం కంపెనీలు చాలా వేగంగా 4జీని విస్తరించుకుంటూ పోతుంటే మరో వైపు బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 3జీలోనే ఉండడం వినియోగదారులకు చిరాకును పుట్టిస్తోంది. అందుకే బీఎస్ఎన్ఎల్ ను వాడుతున్న వినియోగదారుల సంఖ్య రోజు రోజుకీ తగ్గుతోంది. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 1.7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. కేంద్ర ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయకపోతే మాత్రం ఈ ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరమే అవుతుంది. మరి బీఎస్ఎన్ఎల్ కథ ముగుస్తుందా..? ఆ కంపెనీ నష్టాల బారి నుంచి బయట పడి ముందుకు సాగుతుందా..? అనేది తెలియాలంటే.. మరికొద్ది రోజుల పాటు వేచి చూడక తప్పదు..!