ఆర్థిక ప్యాకేజీ అయిపోయింది.. రాష్ట్రాల‌కు మొండి చేయి మిగిలింది..!

-

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టాల‌ని చెబుతూ.. కేంద్రం ప్ర‌క‌టించిన‌ రూ.20 ల‌క్ష‌ల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ లెక్క‌లు అయిపోయాయి. దేశంలో అనేక రంగాల‌కు ఆ ప్యాకేజీలో కొద్ది మొత్తాల‌ను కేటాయించారు. గ‌త 5 రోజులుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆ ప్యాకేజీని ఎందుకు ఖ‌ర్చు చేయ‌నుందీ వెల్ల‌డించారు. కానీ ఎక్క‌డా రాష్ట్రాల ఊసెత్త‌లేదు. దీంతో ప్ర‌స్తుతానికి ప్యాకేజీ ఖాళీ అయి.. రాష్ట్రాల‌కు మొండి చేయే మిగిలింది..

centers economic package is over and empty hand to states

క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల అటు కేంద్ర ప్ర‌భుత్వ‌మే కాదు, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కూడా పెద్ద ఎత్తున ఆదాయానికి గండి ప‌డింది. ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించ‌డానికి, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు కావ‌ల్సిన నిధులు ఇప్పుడు రాష్ట్రాల వ‌ద్ద లేవు. దీంతో గ‌తంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాల‌కు స‌హాయం చేయాల‌ని కేంద్రాన్ని ప‌లు మార్లు కోరారు. రాష్ట్రాల‌పై కేంద్రం హెలికాప్ట‌ర్ మ‌నీని కురిపించాల‌ని అన్నారు. అయితే రూ.20 ల‌క్ష‌ల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌టించ‌డంతో అందులో రాష్ట్రాల‌కు కేటాయింపులు చేస్తార‌ని అనుకున్నారు. కానీ అలా చేయ‌లేదు. అన్ని రంగాల‌కు ఆ ప్యాకేజీని పంచారు. అందులో రాష్ట్రాల‌ను అస‌లు ప‌ట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాలు దిక్కు తోచ‌ని స్థితిలో ప‌డిపోయాయి.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్యాకేజీని నిజానికి అమ‌లు చేసేది రాష్ట్ర ప్ర‌భుత్వాలే. కానీ ఆ ప్యాకేజీ కేంద్రం ఆధ్వ‌ర్యంలో ఖ‌ర్చ‌వుతుంది. త‌డ‌వ‌కు ఇంత అని చెప్పి కేంద్రం విడుద‌ల చేసే నిధుల‌ను రాష్ట్రాలు కేంద్రం సూచించిన మేర ఖ‌ర్చు చేయాలి. అయితే ఒక్కో రాష్ట్రానికి ఇంత మొత్తం అని విడుద‌ల చేసి.. ఆ నిధుల‌ను రాష్ట్రాలు త‌మ సొంత అవ‌స‌రాలకు వాడుకోవ‌చ్చ‌ని చెబితే బాగుండేది. కానీ అలా జ‌ర‌గలేదు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితి ఏర్ప‌డింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం ఆదుకుంటుంద‌ని, త‌మ‌కు నిధులు అంద‌జేస్తుంద‌ని రాష్ట్రాలు ఆశప‌డ్డాయి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వాలకు ఇప్పుడు ఆదాయాన్ని తిరిగి ర‌ప్పించుకునేందుకు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అనుస‌రించ‌డం త‌ప్ప‌.. వేరే గత్యంత‌రం క‌నిపించ‌డం లేదు. అదే జ‌రిగితే ప్ర‌భుత్వాలు సామాన్యుల‌పై పన్నుల భారం మోప‌డం ఖాయం. దీంతో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికి వ‌స్తుంది. అస‌లే క‌రోనా కార‌ణంగా తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న జ‌నాల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు పన్నుల భారం మోపితే.. మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ చందంగా ప‌రిస్థితి మారుతుంది. దీంతో కేంద్రం అటు ప్యాకేజీని ప్ర‌క‌టించి లాభం ఉండ‌దు. క‌నుక ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే.. రాష్ట్రాల‌కు కేంద్రం ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని అందజేయాల్సిన‌ అవ‌స‌రం ఎంతైనా ఉంది..!

Read more RELATED
Recommended to you

Latest news