కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్ది రోజుల కిందట చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. లాక్‌డౌన్ ఆరంభంలో రూ.30 అత్యల్ప ధర పలికిన చికెన్ ఇప్పుడు కొండెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. అనేక చోట్ల చికెన్ ధర ఇప్పుడు రూ.290 పలుకుతోంది. కరోనా నేపథ్యంలో జనాలు తొలుత చికెన్ తినడం మానేశారు. దీంతో ధరలు భారీగా తగ్గాయి. ఫలితంగా పౌల్ట్రీ పరిశ్రమ భారీ నష్టాలను చవి చూసింది. అయితే ఇప్పుడు డిమాండ్ ఉన్నా సప్లయి లేకపోవడంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి.
సాధారణంగా వేసవిలో చికెన్ ధరలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. లాక్‌డౌన్ కారణంగా కోళ్లకు సరిగ్గా ఫీడ్ అందడం లేదు. ఆంక్షలను సడలించినా.. అనేక చోట్ల ఫీడ్ రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో చికెన్ సప్లయి తగ్గింది. ఫలితంగా డిమాండ్ అధికంగా ఏర్పడింది. దీంతో ధరలు భారీగా పెరిగాయి. చికెన్ తింటే కరోనా వస్తుందనే భయంతో మొన్నటి వరకు జనాలు చికెన్ తినడం మానేశారు. కానీ జనాల్లో అవగాహన రావడంతో.. చికెన్‌ను మళ్లీ తినడం మొదలు పెట్టారు. ఇక లాక్‌డౌన్ కారణంగా ఇండ్లలోనే ఉంటుండడంతో అంతకు ముందు వారానికి ఒక్కసారి చికెన్ తినేవారు ఇప్పుడు రెండు సార్లు తింటున్నారు. దీని వల్ల డిమాండ్ కూడా భారీగా ఏర్పడి.. చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
అయితే మరో నెల రోజులు గడిస్తే చికెన్ ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అప్పటి వరకు చికెన్ సప్లయి కొంత వరకు పెరుగుతుందని అంటున్నారు. కానీ అప్పటి వరకు చికెన్ ధరల మోతను భరించక తప్పదని వ్యాపారులు సైతం తెలియజేస్తున్నారు.