తెలుగు వికీపీడియాకు తెలంగాణ తోడ్పాటు

-

అదో స్వేచ్ఛావిజ్ఞాన సర్వస్వం. వికీపీడియా. ఇంటర్‌నెట్‌లో ఈ పేరు తెలియని వారుండరు. ఏ విషయం గురించైనా తెలుసుకోవాలంటే వికీ తప్పనిసరి. ఇప్పుడు తెలుగులో కూడా అడుగుపెట్టింది.

వికీపీడియాను తెలుగులో సమర్థవంతంగా ఉపయోగించుకోవాడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. భారతీయ భాషలలో సమాచార లభ్యత దాదాపు శూన్యం. ఇప్పటికిప్పుడు ఓ ప్రయత్నం మొదలుపెట్టినా, అది అందరికీ లభించడానికి చాలా సమయం పడుతుంది. అందుకని ఇంగ్లీషులో సమస్త సమాచార సర్వసంగా సేవలందిస్తున్న వికీపీడియానే ఇందుకు వాడడం సమంజసమని మేధావులు, భాషాభిమానుల భావన మేరకు తెలుగులో సమాచారం పొందుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. తన డిజిటల్‌ మీడియా విభాగం ద్వారా వికీపీడియాతో ఒప్పందం కుదుర్చుకుని పని మొదలుపెట్టింది.

ఇంగ్లీషు వికీపీడియాలో ప్రస్తుతం 60 లక్షల వ్యాసాలు ఉండగా, సంవత్సరానికి 2 లక్షలకు పైగా వ్యాసాలు పెరుగుతున్నాయి. అవన్నీ దాదాపు 5 కోట్ల పేజీలలో ఉన్నాయి. సమాచార నిల్వ దాదాపు 15 టెరాబైట్లని ఒక అంచనా. దాదాపు ప్రతి విషయంపై ఇంగ్లీషులో సమాచారం అందుబాటులో ఉంది. తెలుగులో మాత్రం ఇప్పటికి 70వేల పేజీల సమాచారం మాత్రమే లభిస్తోంది. దీన్ని విస్తృతంగా పెంచాలని తెలంగాణ డిజిటల్‌ మీడియా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు హైదరాబాద్‌ ట్రిపుల్‌ ఐటీ సహకారం తీసుకుంటోంది. తెలుగు భాష ఇప్పటికే యూనికోడ్‌ కన్సార్టియంలో సభ్య భాష అయినందున సమాచారాన్ని కంప్యూటరీకరణ చేయడం సులువు. తెలుగులో టైప్‌ చేసేందుకు పలు ఉపకరణాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ డిజిటల్‌ మీడియా డైరక్టర్‌ దిలీప్‌ కొణతం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నేతృత్వం వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కొంతమంది నిష్ణాతులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసారు. ట్రిపుల్‌ ఐటీ తరపున కూడా కొందరు సభ్యులు, వీరందరికీ తోడ్పాటునందించేందుకు పెద్ద సంఖ్యలో వలంటీర్లు కూడా ఉన్నారు.

అయితే, తెలుగులో సమాచారాన్ని వికీపీడియాలోకి ఎక్కించాలంటే, వీరు మాత్రమే సరిపోరు. సమాజం నుండి కూడా పెద్ద ఎత్తున సమాచార సరఫరా జరగాలి. ఉపాధ్యాయులు, పాత్రికేయులు, పండితులు, కవులు-రచయితల ఇందుకు సహకరించాలి. భారీస్థాయిలో వస్తున్న సమాచారాన్ని పరిశీలించి, తప్పులు లేకుండా సరిదిద్ది, ఆ తర్వాతే వికీపీడియాలోకి పోస్ట్‌ చేయాలనేది దిలీప్‌ సంకల్పం. ఇందుకోసం అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నారు. ఒక పక్కా ప్రణాళికతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు. ముందుగా, చరిత్ర, పర్యాటకం, రాజకీయం, సాహిత్యం… ఇలా ఒక్కో అంశంపై సమాచారాన్ని క్రోడీకరించి సమగ్రంగా అందించడంపై దృష్టి సారించనున్నారు. తర్వాత మిగిలిన అంశాలను కూడా ఇదే పద్ధతిలో అందిస్తారు.

స్వచ్చందంగా సమాచారాన్ని అందించాలనుకునేవారు వలంటీర్లుగా నమోదు కావచ్చని దిలీప్‌ కొణతం తెలిపారు. 99592 63974 నెంబరుకు వాట్సప్‌ ద్వారా కానీ, tewiki@iiit.ac.in అనే ఈమెయిల్‌ ద్వారా కానీ సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version