ఎడిట్ నోట్ : కోటి ట‌న్నుల తెలంగాణ కోటి ర‌త‌నాల వీణ అవునా !

-

తెలంగాణ వాకిట వ‌రుస‌గా మూడోసారి కోటి ట‌న్నుల చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని సీఎం కేసీఆర్ అంటున్నారు. నిజంగానే ఇదొక రికార్డు అని చెబుతున్నారాయ‌న. అదేవిధంగా దేశంలోనే ధాన్యం కొనుగోళ్ల‌లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింద‌ని కూడా అంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక కోటీ 18 ల‌క్ష‌ల ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామ‌ని చెబుతున్నారు కేసీఆర్.

ప్ర‌భుత్వం చేసిన కొనుగోళ్ల‌తో పాటు ప్ర‌యివేటు కొనుగోళ్లు కూడా క‌లిపితే తెలంగాణ దేశంలోనే నంబ‌ర్ ఒన్ అని కూడా అంటున్నారు. ధాన్యం కొనుగోళ్ల విష‌య‌మై బీజేపీ స‌ర్కారు చేతులెత్తేసినా, తామెంతో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి రైతున్న‌ల‌ను ఆదుకున్నామ‌ని అంటున్నారు. ఇదంతా బాగుంది ధాన్యం కొనుగోళ్లకు మొత్తం చెల్లించాల్సింది తొమ్మిది వేల కోట్ల‌కు పైగా అని తేలింది. మ‌రి ! ఇప్ప‌టిదాకా చెల్లించింది ఐదు వేల ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే ! అంతేకాదు మంగ‌ళ‌వారం నుంచి అన్నింటా ధాన్యం కేంద్రాలు మూత‌ప‌డ్డాయి కూడా ! కొనుగోలు పూర్తి అయినందునే వీటిని మూసివేయాల్సి వ‌చ్చింద‌ని కూడా అంటున్నారు సంబంధిత అధికారులు. మ‌రి ! బకాయిలు ఎవ‌రు తీరుస్తారు ? ఎప్పుడు తీరుస్తారు ? అన్న‌వి రైతాంగం ప్ర‌శ్న‌లు.

వాస్త‌వానికి ఈ ఏడు ధాన్యం కొనుగోలు విషయ‌మై పెద్ద త‌తంగ‌మే నడిచింది. కేంద్ర‌మే కొనుగోలు చేయాల‌ని అంటూ పెద్ద వివాద‌మే న‌డిపారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై ఓ స్ప‌ష్టత అన్న‌ది కేంద్రం నుంచి రానుందున తామే ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని ఆఖ‌రికి కేసీఆర్ ప్ర‌క‌టించి, సంబంధిత చ‌ర్య‌ల‌కు వెనువెంటనే ఉప‌క్ర‌మించాల‌ని కూడా చెప్పారు.ఇదంతా బాగానే ఉన్నా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ‌లో చాలా ఇబ్బందులు తలెత్తాయి. మ‌రోవైపు ఆంధ్రా నుంచి కూడా కొంత ధాన్యం ఇటుగా రావ‌డం పెద్ద దుమార‌మే రేపింది. దీంతో సంబంధిత స‌మాచారం అందుకున్న అధికారులు ఆంధ్రా – తెలంగాణ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

అటుపై ధాన్యం కొనుగోలుకు సంబంధించి కొంత సాఫీగా సాగినా, వెనువెంటనే డ‌బ్బులు చెల్లించ‌డంలో మాత్రం పెద్ద‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టలేదు అన్న విమ‌ర్శ ఉంది. అదే నిజం కూడా ! చాలా చోట్ల ప్ర‌భుత్వ తీరుతో విసిగి త‌క్కువో, ఎక్కువో వ‌చ్చినంత రానివ్వ‌ని అని ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు ఈ సారి రైతులు పంట‌ను అమ్ముకున్నారు. ఇంత జ‌రిగాక కూడా టీ స‌ర్కారు త‌మ చ‌ర్య‌లు అన్నీ స‌త్ఫ‌లితాలు ఇచ్చాయి అని, ధ్యానం కొనుగోలు కేంద్రాల‌కు సంబంధించి త‌మ నిర్వ‌హ‌ణ బాగుంద‌ని చెప్పుకోవ‌డ‌మే పెద్ద విడ్డూరం.

Read more RELATED
Recommended to you

Latest news