ఎడిట్ నోట్ : టీడీపీ సభ్యులకు మంత్రి సీదిరి సుద్ధులు !

-

టీడీపీ నాయ‌కులకు నాలుగు మంచి మాట‌లు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తూనే మంత్రి సీదిరి మ‌రికొన్ని ఆస‌క్తిదాయ‌క విష‌యాలు కూడా ఇటీవ‌ల కాలంలో వెల్ల‌డి చేస్తున్నారు. అదేవిధంగా నోరు జారితే టీడీపీ నాయ‌కుల‌పై తిరుగుబాటు చేయాల‌ని కూడా పిలుపునిస్తున్నారాయ‌న‌. ఇదే స‌మ‌యంలో త‌రిమేద్దామా టీడీపీని అని ప‌లాస మున్సిప‌ల్ కౌన్సిల్ లో నినాదాలు వినిపిస్తున్నారాయ‌న‌. ఇప్పుడు స్థానికంగా అనేక చ‌ర్చ‌ల‌కు ఉద్రిక్త‌త‌ల‌కు తావిస్తున్నాయి. మంత్రి వ్యాఖ్య‌లు విని గౌతు శిరీష (ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కురాలు) ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. పాల‌న సంబంధ త‌ప్పిదాల‌నే తాము వెలుగులోకి తెచ్చామ‌ని, ఇందులో కోప‌తాపాల‌కు తావే లేద‌ని అంటున్నారామె. అయినా కూడా మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు త‌గ్గేదేలే అన్న విధంగానే త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. ఈ నేప‌థ్యాన మంత్రి ప‌నితీరు రేప‌టి వేళ ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిని ఏ విధంగా ప్ర‌భావితం చేస్తుందో అన్న‌ది ఆస‌క్తిదాయ‌కం.

వాస్త‌వానికి ప‌లాస కేంద్రంగా రెండు కుటుంబాల మ‌ధ్య ఏనాటి నుంచో రాజ‌కీయ వైరం న‌డుస్తోంది.ముఖ్యంగా గౌతు కుటుంబానికి అక్క‌డున్న పేరు ఇప్పుడిప్పుడే త‌గ్గుతూ వ‌స్తోంది. గౌతు శివాజీ కుటుంబ రాజ‌కీయాల‌ను అడ్డుకుంటూ సీన్లోకి యువ‌కుడు అయిన సీదిరి అప్ప‌ల్రాజు వ‌చ్చారు. తొలిసారిగా పోటీచేసి మంచి మార్కులే కొట్టేశారు. ఆవేశం,ఆలోచ‌న అన్న‌వి తీవ్రమ‌యిన స్థాయిలో ఉన్నా కూడా ఆయ‌న అధినాయ‌క‌త్వానికి మాత్రం విధేయుడే! ప్రజా స‌మ‌స్య‌ల‌పై మంచి ప‌ట్టు ఉంది. వాటిని ప‌రిష్క‌రించే యోచ‌న‌లో భాగంగా ఆయ‌న ద‌గ్గ‌ర ఒక వ్యూహం కూడా ఉంది. ఇవే ఆయ‌న‌కు అనుకూల అంశాలు. కొన్ని త‌ప్పిదాలు మిన‌హాయిస్తే ఇవాళ విప‌క్షాన్ని ఒంటిచేత్తో ఎదుర్కోగ‌ల స‌త్తా కూడా ఆయ‌న‌కే ఉంది.

ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో చాలా ప‌నుల‌కు తాను ప్ర‌భుత్వం నుంచి ఆమోదం పొందాన‌ని కూడా అంటున్నారీయ‌న. ప‌లాస‌కు రెవెన్యూ డివిజ‌న్ ను తీసుకుని వ‌చ్చాన‌ని, అదేవిధంగా నాడు నేడు ప‌థ‌కం అమ‌లులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో బ‌డుల‌కు మంచి రూపం ఇవ్వ‌గ‌లిగాన‌ని, మ‌రీ ! ముఖ్యంగా నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంకు ఒక డిగ్రీ క‌ళాశాల మంజూరు చేయించానని, అదేవిధంగా మ‌త్స్య‌కారులకు భావ‌న‌పాడు హార్బ‌ర్ నిర్మాణానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని, రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి కూడా తానే చొర‌వ తీసుకున్నాన‌ని వివ‌రిస్తూ ఉన్నారు.

ఈ ద‌శ‌లో ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వంలో కీలకంగా ప‌నిచేస్తున్న మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు కు ఎన్నో ప్ర‌త్యేకతలు ఉన్నాయి. ఆయ‌న అతి సామాన్య స్థాయి నుంచి పైకి వ‌చ్చారు.రాష్ట్రంలో నెల‌కొన్న చాలా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న ఉన్న వ్య‌క్తి.అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడ‌గ‌ల‌రు. అదేవిధంగా చాలా సార్లు వివాదాల్లో ఇరుక్కున్న వ్య‌క్తి కూడా ఆయ‌నే ! అతిగా స్పందించే తీరు కొన్ని సార్లు వివాదాల‌కు తావిచ్చినా..అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి సంబంధించి స్ప‌ష్ట‌మ‌యిన విధి విధానం ఒక‌టి అమ‌లు చేయాల‌న్న త‌ప‌న ఆయ‌న‌లో అణువ‌ణువునా ఉంది.అదేవిధంగా విప‌క్ష స‌భ్యుల వ్యాఖ్య‌ల‌పై కూడా ఆయ‌న‌కు విప‌రీతం అయిన కోపం ఉంది. ఈ రెండూ కూడా ప‌లాస మున్సిప‌ల్ కౌన్సిల్ స‌మావేశంలో నిన్న‌టి వేళ ఆవిష్కృతం అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news