బోధన్ ఘటన వెనక కుట్ర కోణం ఉందని పోలీసులు తేల్చారు. బోధన్ లో నిన్న ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు పోలీసులు టియర్ గ్యాస్ పేల్చేవరకు వెళ్లింది పరిస్థితి. పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
బోధన్ అల్లర్ల వెనక ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉందని పోలీసులు అంటున్నారు. శివసేన పార్టీకి చెందిన గోపీ, శరత్ పాత్ర ఉందని పోలీసులు తేల్చారు. ఇటీవల మున్సిపల్ కౌన్సిల్ లో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని తీర్మాణం చేశారు. అయితే ఎప్పుడనేదానిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే శివాజీ విగ్రహాన్ని రాత్రికిరాత్రి పెట్టేందుకు ఈ ఇద్దరి ప్రమేయం ఉందని వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని అడిషనల్ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. అయితే నెలరోజుల కిందనే బోధన్ పట్టణంలో 5 విగ్రహాలు ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మాణం చేసింది. అయితే కౌన్సిల్ పర్మిషన్ తీసుకోకుండా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని పోలీసులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు 4 కేసులు నమోదయ్యాయి. 10 మందిని అరెస్ట్ చేశారు.