ఈపీఎఫ్‌వో వేజ్‌ సబ్సిడీతో 10 లక్షల కొత్త ఉద్యోగాలు..!

కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆత్మనిర్భర భారత్‌ రోజ్‌గార్‌ యోజన (ఏబీఆర్‌వై) పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీల మధ్య జాబ్‌లను కోల్పోయి, తిరిగి అక్టోబర్‌ 1 ఆ తరువాత ఉద్యోగాల్లో చేరేవారు, కొత్త వారికి ఈపీఎఫ్‌వో సబ్సిడీ 24 శాతం లభిస్తుంది. కేవలం రూ.15వేల లోపు వేతనాలు పొందే వారికే ఈ పథకం వర్తిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సదరు సబ్సిడీ వల్ల దేశంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

epfo subsidy of 24 percent can create 10 lakhs jobs in india

కాగా కేంద్రం అందించనున్న సబ్సిడీ వల్ల కేంద్రంపై మొత్తం రూ.6వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో 20 అంతకన్నా ఎక్కువ మంది ఉద్యోగులు కలిగిన కంపెనీలు సుమారుగా 5 లక్షల వరకు ఉన్నాయి. అయితే ఉద్యోగాల్లో చేరే వారికి పైన తెలిపిన పథకం వర్తించాలంటే వారిలో ఒక్క కంపెనీ కనీసం ఇద్దరు ఉద్యోగులు తిరిగి చేర్చుకోవాలి. లేదా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి. వారి వేతనాలు రూ.15వేల లోపు ఉండాలి. అయితే దీని వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాటిల్లో పనిచేసే వేతన జీవులకు ఎంతగానో లాభం ఉంటుందని అంటున్నారు.

50 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు రూ.15వేలు అంతకన్నా తక్కువ వేతనంతో కనీసం ఇద్దరికి ఉద్యోగాలు ఇస్తే పైన తెలిపిన పథకం వర్తిస్తుంది. అదే 50 కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే అలాంటి కంపెనీలు కనీసం 5 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ క్రమంలో 5 లక్షల కంపెనీలు కనీసం ఇద్దరు చొప్పున వర్కర్లను ఉద్యోగంలోకి తీసుకున్నా వారి సంఖ్య 10 లక్షలు అవుతుంది. అంటే ఈ పథకం వల్ల మొత్తం 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నమాట. అయితే ఈ విషయం తెలియాలంటే మరిన్ని రోజులు చూడక తప్పదు.