మంత్రి కేటీఆర్ సీఎం అవుతారని గతంలో కొందరు ప్రజా ప్రతినిధులు బహిరంగ వేదికలపై కేటీఆర్ ఎదుటే కామెంట్లు చేశారు. అప్పట్లో కేటీఆర్ ఆ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. సాక్షాత్తూ మంత్రులే కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి ? అని వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా కేటీఆర్ ఎదురుగానే. కానీ ఆ వ్యాఖ్యలను ప్రస్తుతం కేటీఆర్ ఖండించడం లేదు. అంటే.. ఆయన సీఎం అవడం పక్కా.. అని తేలిపోయింది. మరి.. ఆయన సీఎం ఎప్పుడు అవుతారు ? ఒక వేళ ఇప్పుడే సీఎం అయితే.. ఇది అందుకు సరైన సమయమేనా ? అంటే.. అందుకు రాజకీయ వర్గాల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
మంత్రి కేటీఆర్‌ను సీఎంను చేస్తూ ఆటోమేటిగ్గా మంత్రివర్గం రద్దు అవుతుంది. కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేయాలి. దీంతో కేటీఆర్ తనకు అనుకూలంగా ఉండే వారికి చాన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు రెబల్స్ పుట్టుకొస్తారు. వారు సొంత కుంపటి పెట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అలాంటి క్లిష్టతరమైన పరిస్థితిని కేటీఆర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. కనుక ఆయనను ఇప్పుడే సీఎంను చేయడం సరికాదు.. అని కొందరు తెరాస నాయకులు మీడియాతో అంటున్నారు.
అయితే మంత్రి కేటీఆర్‌ను సీఎంను చేయడం వల్ల కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టవచ్చని, దీంతో పార్టీ బలోపేతం అవుతుందని, ప్రస్తుతం తెరాస ఉన్న పరిస్థితిలో ఇది కలసి వస్తుందని, కనుక కేటీఆర్‌ను సీఎంను చేయాల్సిందేనని మరొక వర్గం వాదిస్తోంది. అయితే ఎంతమంది ఎన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నా సీఎం కేసీఆర్ మనస్సులో ఏముందో ఎవరికీ తెలియదు. కనుక ఆయన స్వయంగా నిర్ణయం తెలిపేవరకు అందరూ వేచి చూడాల్సిందే.