మంత్రిపదవి లేకపోతే… ఆయనకు బతుకే లేదు. ఆయన ఆశకు అంతులేదు. మచ్చలేని నాయకుడినంటూ ఆస్కార్ లెవెల్లో నటించిన జోగు రామన్న గురివింద నైజం ఆదిలాబాద్ ప్రజలలందరికీ తెలుసు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరిగిననాటినుంచీ అడ్రస్ లేకుండా పోయిన మాజీ అటవీశాఖామాత్యులు ఎట్టకేలకు మీడియా ముందు ప్రత్యక్షమై వీరవిహారం చేసారు. తన అసమాన నటనావైదుష్యాన్ని కన్నులపండువగా రక్తి కట్టించారు. భోరుభోరున విలపిస్తూ, పాత్రలో జీవించారు.
మంత్రి పదవి మీద ఆశతో ఉన్నట్లు తెలిపిన ఆయన, అసలు ఈ ఆశ ఎందుకో, మంత్రిపదవి ఇస్తే ఏం చేస్తాడో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, అటవీశాఖ అధికారులకు బాగా తెలుసు. పోయిన అయిదేళ్లు పదవిననుభవించి, విచ్చలవిడిగా చెలరేగిపోయిన వీరికి మరోసారి అవకాశం కల్పించి, మైదాన ప్రాంతాలను అభివృద్ధి చేసే భాగ్యం కలిగించాలని వారి ఆశ.
ఈసారి సరే..! పోయిన ఎన్నికలలో గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలలో ఈయనా ఒకరు. సమీకరణాలేవైనా మంత్రి పదవి మాత్రం దక్కింది. కేవలం కేసీఆర్ దయ వల్లనే కలలో కూడా ఊహించని పదవి వచ్చింది. 2011లో టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన రామన్న, వచ్చిన అవకాశమే మహద్భాగ్యమని అనుకోక, మళ్లీ కావాలంటూ గోల చేయడం విడ్డూరంగా ఉంది. మరి మిగిలిన 45మందికి ఎటువంటి ఆశలు ఉండక్కరలేదా? లేక ఇంకా మున్నూరుకాపు ఎమ్మెల్యేలు ఎవరూ లేరనుకుంటున్నాడా?
సర్పంచి స్థాయి నుంచి వచ్చినవాడినని, మచ్చలేని నాయకుడినని చెప్పుకుంటున్న ఈయన, తన గత హయాంలో కుమారుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, వందలాది ఎకరాల అడవిని మాయం చేసారు. వీరి దుశ్చర్యలకు బలయిన అడవిని మళ్లీ పునరుజ్జీవితం చేయాలంటే వంద హరితహారాలు కావాలి. మంత్రిపదవి దక్కనందునే మనస్తాపానికి గురయి, మంచమెక్కానని విలేకరుల సమవేశంలో కంటతడి సహా పాత్రోచితంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.
నిజానికి ఈయనగారు చేసిన హేయమైన పనికి అసలు టికెట్టే ఇవ్వగూడదు. సభ్యసమాజం తలవంచుకునేలా, మానవత్వం మంటగలిసేలా వ్యక్తిగతంగా దిక్కుమాలిన పని చేసి రాజకీయంగా పదవి కావాలనడం సిగ్గుచేటయిన విషయం. ఏ రకంగా చూసినా మంత్రిస్థాయి ఏమాత్రం లేని రామన్న కేసీఆర్ ఉదారత్వంతో అన్ని రకాలుగా బతికి బట్టకడుతున్నాడు. ఇంకా ఎందుకు? చేసింది చాలదా? తనతోపాటు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలున్నారు, వారికీ పదవులు రావాలికదా అనే కనీస మానవత్వం కూడా లేని జోగురామన్న లాంటి వారిని రాజకీయాల్లోనుండి తరిమేయాలి.
రుద్రప్రతాప్