ఎడిట్ నోట్: మహానేత!

-

రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు…అలాగే నాయకులుగా ఎదగొచ్చు…ఉన్నత పదవులు పొందవచ్చు…కానీ ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచే నేతలు కొందరే ఉంటారు…ప్రజల మనిషిగా ఉంటూ..నిరంతరం ప్రజల కోసం పనిచేసే నేతగా దివంగత వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి….ఎప్పుడు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పొచ్చు. చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేసి…ప్రజా నేతగా ప్రజల మనసులో ఉండిపోయారు.

పేద, మధ్య తరగతి ప్రజల బాగోగుల కోసం వైఎస్సార్ చేసిన కృషి మరవలేనిది..ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ లాంటి పథకాలని తీసుకొచ్చి ప్రజలకు అండగా నిలిచి మహానేతగా ఎదిగారు. ప్రజల మనసులో మహానేతగా ముద్రవేసుకున్న వైఎస్సార్ రాజకీయ ప్రస్థానం కూడా ఓటమి లేనిది. రాజకీయాల్లో ఓటమి ఎరగని నాయకులు అరుదుగా ఉంటారు.

అలాంటి అరుదైన నేతల్లో వైఎస్సార్ కూడా ఒకరు…ఆయనకు ఓటమి ఎప్పుడు దూరమే. 1978, 1983, 1985 ఎన్నికల్లో పులివెందుల ఎమెల్యేగా…1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో కడప ఎంపీగా గెలిచి సత్తా చాటారు. 1999, 2004, 2009 ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నుంచి విజయాలు అందుకున్నారు. అలాగే రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రెండు సార్లు సీఎం అయిన ఘనత వైఎస్సార్ దే.

అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే…నేతల మధ్య సమన్వయం ఉండదు…ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు నడుపుతారు…ఇక అలా ఉన్న పార్టీని సైతం దారిలో పెట్టి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారు. 1999 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం కొనసాగిన విషయం తెలిసిందే…చంద్రబాబు రెండోసారి సీఎంగా అయ్యారు. దీంతో కాంగ్రెస్ నేతలు అధికారంపై ఆశలు వదిలేసుకున్నారు…చంద్రబాబు దెబ్బకు ఎవరికి వారు సైలెంట్ అయ్యారు.

కానీ వైఎస్సార్ ధైర్యంగా నిలబడి…చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం చేయడమే కాదు…పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడ్డారు. ఇక ఐదేళ్లలోనే చంద్రబాబుకు ఓటమి రుచి చూపించారు. 2004లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు…ఇక మొదటి సారి సీఎం అయ్యి…ప్రజారంజక పాలన అందించారు. సరికొత్త పథకాలని ప్రజల కోసం అమలు చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ, 108, 104, పావలా వడ్డీ, అభయ హస్తం, జలయజ్ఞం, రుణ మాఫీ, భూపంపిణీ, పశు క్రాంతి, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక బృందాలు..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ప్రజలకు అందించారు. ఇలా ప్రజా సేవ చేస్తూనే ఆయన తుదిశ్వాస విడిచిన సంగతి తెలుగు ప్రజలు ఎన్నడూ మరిచిపోరు…అయితే భౌతికంగా ఆయన ప్రజల మధ్యలో లేరు గాని..ఆయన రూపం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనే చెప్పాలి. రైతు సంక్షేమమే ధ్యేయంగా తుది శ్వాస వరకూ పనిచేసిన మహానేత వైఎస్‌ పుట్టిన రోజైన జూలై 8ని ‘రైతు దినోత్సవం’గా జరుపుకొంటున్నాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version