‘మహర్షి’కి కాల‌ర్‌ ఎగరేసేంత ఉందా?

-

మహేష్‌బాబు నటించిన నయా సినిమా ‘మహర్షి’ గత గురువారం వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అశ్వినీదత్‌, దిల్‌రాజు, పీవీపీ నిర్మించారు. పూజా హెగ్డే కథానాయికగా, అ్లరి నరేష్ కీల‌క పాత్రలో నటించారు. ఈ సినిమా మొదటి వారాంతం మంచి కలెక్షన్లని రాబట్టుకుంది. అయితే ‘మహర్షి’ ఒక అద్భుతమైన సినిమా అని, గర్వపడే సినిమా అని ఇటీవల‌ సక్సెస్‌ మీట్‌లో మహేష్‌తో, దిల్‌రాజు, వంశీపైడిపల్లి చెప్పుకున్నారు. మహేష్‌ ఓ అడుగు ముందుకేసి కాల‌ర్‌ ఎగరేశారు. మరి నిజంగానే సినిమాలో అంతుందా? అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎందుకంటే సినిమాలో ఎన్నో లూప్స్‌ ఉన్నాయి. లాజిక్స్‌కి అందని అంశాలున్నాయి. ఓ మామూలు మధ్యతరగతి వ్యక్తి సక్సెస్ ని ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగి తన జీవితంలో అనుకున్నది సాధించడం, అగ్ర స్థానంలో నిల‌బడేందుకు చేసే జర్నీ ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.

ఈ క్రమంలో తన ప్రేమని, స్నేహితుడిని వదిలేయడం ఎక్కడ గొప్ప ప‌ని అవుతుంది? స్నేహితుతో టచ్‌లో లేకుండా ఉండటం ఈ రోజుల్లో జరగని ప‌ని, ఎందుకంటే టెక్నాల‌జీ చాలా పెరిగింది. క్షణ క్షణం వారి సమాచారం తెలుస్తుంది. అలాంటిది ఉన్న ఒక్క స్నేహితుడు ఏమై పోయాడో తెలియకుండా హీరో ఉండటం లాజిక్‌ లెస్‌ సీన్‌. ఇక హీరోపై పడ్డ నింద‌ని స్నేహితుడు తనపై వేసుకున్నాడు. కానీ సినిమా మొత్తంలో ఆ తప్పు చేసింది ఎవరో చూపించలేదు. దీనికితోడు హీరో తండ్రి ఐఏఎస్‌కి సెల‌క్ట్‌ కావల్సిన టైమ్‌లో కేసులో ఇరుక్కుని జాబ్‌ పోగొట్టుకున్నార‌న్నారు. ఓ తండ్రి ఏం చేశాడనేది ముప్పై ఏండ్లలో ఏ రోజు కొడుక్కి తెలియకుండా ఉంటుందా?. ఇందులో చాలా ఇతర సినిమాల స‌న్నివేశాలు క‌నిపిస్తాయి. కాలేజ్ సీన్స్ ‘త్రీ ఇడియట్స్ ని తల‌పిస్తాయి. రైతు అంశం కొత్తది కాదు. ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలే ఆర్‌.నారాయణమూర్తి ‘అన్నదాత సుఖీభవ’ అనే సినిమా కూడా తీశారు. సినిమా మొత్తం రైతు సమస్యల‌పైనే అది సాగుతుంది. ఇన్‌ డెప్త్‌గానూ ఉంటుంది. అలా కూడా ‘మహర్షి’లో లేదు. రైతు సమస్యను నిర్మాణాంత్మకంగా చూపించలేదు. వీకెండ్‌ అగ్రిక‌ల్చ‌ర్‌ కాన్సెప్ట్‌ కూడా కొత్తది కాదు. చాలా రోజుగా సాఫ్ట్‌ వేర్‌ కంపెనీల్లో, స్కూల్‌లో ఇలాంటి ఓ చర్చ జరిగినదే.

వీకెండ్‌లో గ్రామాల్లోకి వెళ్ళడం ఎప్పట్నుంచో జరుగుతుంది. హీరో విలేజ్‌కి వెళ్ళడం, గ్రామం కోసం పోరాడటం ‘శ్రీమంతుడు’ కాన్సెప్ట్‌. కార్పొరేట్‌ ఆగడాల‌నేది ‘కత్తి’(ఖైదీ నంబర్‌ 150) కాన్సెప్ట్‌. ఇవన్నీ ఓ ఎత్తైతే మొదటి భాగం మాత్రమే హీరో కథ. ద్వితీయార్థంలో హీరో తన ఫ్రెండ్‌ కథలో ట్రావెల్‌ అవుతాడు. అక్కడ అసలు హీరో అ్లరి నరేష్‌. ఆ క్రెడిట్‌ అంతా ఆయనకు వెళ్తుందని, చివర్లో అల్ల‌రి నరేష్ ని హాస్పిటల్‌కే పరిమితం చేశారు. కార్పొరేట్‌ నవీన్‌ మిట్టల్‌ వేసిన ఎత్తుకి ఓడిపోయిన హీరో ‘నేనేమీ చేయలేన’ని ఇంటికి వెళ్ళిపోవడం చాలా సిల్లీ అంశం. సక్సెస్‌ టార్గెట్‌గా వెళ్ళే హీరో చిన్న అడ్డంకినే ఎదుర్కొలేకపోతాడా? ఆ సందర్భంలో ఆయన కూడా ఓ కార్పొరేట్‌గా మైండ్‌ గేమ్‌ ఆడాల్సింది. పైగా జగపతిబాబుతో చివర్లో ఒక్క విలేజ్‌ని వదిలేస్తే పోయేది అని చాలా సింపుల్‌గా చెప్పించడం హీరో గెలిచాడ‌ని ఆడియెన్స్‌ని ముందుగానే ప్రిపేర్‌ చేసినట్టు ఉంది. దీనికితోడు సినిమాలో కీల‌కమైన రావు రమేష్‌ పాత్రని, వెన్నెల‌ కిషోర్‌ పాత్రకి ముగింపు లేదు. హీరోయిన్‌ ఇంటికి తీసుకెళ్ళి తన ప్రేమ విషయం చెప్పినప్పుడు ఓకే చెప్పిన హీరో కాలేజ్‌ పూర్తయ్యాక తన‌కి ఇవన్నీ అడ్డు కాకూడదని చెప్పడం లాజిక్‌ లేస్‌. తను వెళ్ళే గమ్యానికి ఇవన్నీ అడ్డు వస్తాయని ప్రేమని ఎక్స్‌ప్రెస్‌ చేసినప్పుడే చెప్పాల్సింది. ఇలా అనేక లాజిక్స్‌ కి అందని అంశాలు ఇందులో ఉన్నాయి.

పైగా స్టార్టింగ్‌ నుంచి చివరి అరగంట వరకకి సినిమా బోరింగ్‌గానే సాగుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి స్కోప్‌ లేదు. ఇది ఓ రకంగా ఆడియెన్స్‌ సహనానికి పరీక్షే. కానీ దీన్నొక ఎపిక్‌ చిత్రంగా యూనిట్‌ చెప్పుకుంటుంది. కాల‌ర్‌ ఎగరేసే సినిమాగా మహేష్‌ ప్రకటించారు. మరి పై వాటికి ఏం సమాధానం చెబుతారు. కలెక్షన్ల పరంగానూ గొప్పగా లేదు. వీకెండ్‌ వరకు రూ.36కోట్లు షేర్‌ వసూలు చేసింది. హాలీడేస్‌ కావడంతో ఆ మాత్రం వచ్చాయి. కానీ సోమవారం నుంచి పూర్తిగా పడిపోయే ఛాన్స్‌ ఉంది. మొత్తంగా సినిమా గ్రాస్‌ రూ.100కోట్లు దాటితే మహా ఎక్కువ‌. అది కూడా మరో పెద్ద సినిమాలు లేవు కాబట్టి. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఈ సినిమాని చూడాల్సిన ప‌రిస్థితి. తప్ప ప్రత్యేకంగా దీన్నే చూడాల‌నుకునే వారు చాలా తక్కువే. అంతా కొడితే ఇది రంగస్థలానికి దరిదాపుల్లో కూడా ఉండే పరిస్థితి లేదు. మరి ఎపిక్ సినిమా ఎలా అవుతుంది? కాల‌ర్‌ ఎలా ఎగరేస్తారు? దీన్నే మహేశ్‌బాబు కంఫర్ట్‌జోన్‌గా ఫీలయితే, ఇక రాబోయే సినిమాలు చాలా కష్టమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version