మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కొంటోంది. అసలు సరిగ్గా ప్లానింగ్ లేకుండానే లాక్‌డౌన్ విధించారని, వలస కూలీలను సొంత రాష్ట్రాలకు తరలించడంలో కేంద్రం విఫలమైందని, పేద, మధ్య తరగతి వర్గాలకు, కుదలవుతున్న ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్యాకేజీని ప్రకటించలేదని.. అందరూ విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలకు చెక్ పెట్టేలా త్వరలో ప్రధాని మోదీ భారీ యాక్షన్ ప్లాన్ ఉంటుందని సమాచారం.
మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమలవుతుండగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర మంత్రులు ఏం చేశారు, రానున్న రోజుల్లో ప్రజలు, పరిశ్రమల కోసం ఏం చేయాలి, అందుకు ప్లానింగ్ ఎలా ఉండాలి, కరోనా, లాక్‌డౌన్ నుంచి ఎలా బయట పడాలి.. అనే అంశాలపై మోదీ కేంద్రమంత్రులను సవివరంగా నివేదికలు కోరినట్లు తెలిసింది. ఇక పతనమవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఇప్పటికే మోదీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇతర కేంద్ర మంత్రులతోపాటు నిర్మలా సీతారామన్ ఇచ్చే నివేదికను కూడా మోదీ సమూలంగా పరిశీలించి అతి త్వరలోనే భారీ యాక్షన్ ప్లాన్‌ను ప్రకటిస్తారని తెలిసింది.
ఇక లాక్‌డౌన్ మొదలైనప్పుడు పేదల కోసం రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినా.. అది ఏమాత్రం సరిపోలేదు. దీంతో అన్ని వర్గాల వారికి ఊతమిచ్చేలా మోదీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అందుకనే ప్యాకేజీని ప్రకటించడం ఆలస్యమవుతుందని కూడా తెలుస్తోంది. ఇక ఈ యాక్షన్ ప్లాన్‌ను రానున్న 2 నెలల కాలంలో అమలు చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి మోదీ ఈ విషయంపై ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాలి..!