ప్రజల ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకులకు ప్రజా ధనాన్ని వృథా చేయడం అంటే నిజంగా ఎంతో ఇష్టం. అందుకనే కాబోలు.. ప్రజలకు వారు ఏం చేసినా, చేయకపోయినా తమ జీతాలను పెంచుకోవడం, ఉండేందుకు విలాసవంతమైన భవనాలను నిర్మించుకోవడం, తిరిగేందుకు ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం చేస్తుంటారు. అంతేకానీ.. ప్రజలు ఎటుపోతే వారికెందుకు ? వారి డబ్బులతో దర్జా చేయడమే పాలకులకు కావాలి. నేడు ఎక్కడ చూసినా నేతలు చేస్తున్నదదే.
కరోనాతో చనిపోతున్నాం మహాప్రభో.. రక్షించండి.. అంటూ ప్రజలు వేడుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. లాక్ డౌన్ తెచ్చిన కష్టానికి అవస్థలు పడుతున్నాం, ఆదుకోండి.. ప్లీజ్.. అంటూ ఎన్ని వర్గాల ప్రజలు మొర పెట్టుకున్నా పాలకులు కనికరించిన పాపాన పోలేదు. మరోవైపు రైతులు పండించిన ధాన్యానికి గిట్టు బాటు ధర లేక, తక్కువ ధరకు అమ్ముకోలేక రోజుల తరబడి పడిగాపులు కాస్తూ చివరకు ధాన్యాన్ని వర్షాలకు నష్టపోయారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు.
ప్రజలను పాలించే నాయకులే కాదు, వారి కనుసన్నల్లో మెలిగే అధికారులకు వసతులు కావాలి. కరెక్టే. కానీ కరోనా మహమ్మారి తెచ్చిన కష్టం అంతా ఇంతా కాదు. కరోనా దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థే కుప్పకూలింది. జీడీపీ మైనస్‌లలో ఉంది. ఇలాంటి విప్కతర పరిస్థితుల్లో దగ్గర ఉన్న డబ్బును ఆచి తూచి ఖర్చుపెట్టాలి. ఓవైపు నిధులు లేవు, అప్పులివ్వండి.. అంటూ కేంద్రాన్ని, ఆర్‌బీఐని అడుగుతూనే మరోవైపు ఇలాంటి విలాసాలకు ఖర్చు చేస్తే ఎలా ? అప్పు ఇచ్చేవారికైనా ఆ విషయం చూస్తే ఎలా ఉంటుంది ? వారు అప్పు ఇస్తారా ? ఆపద సమయంలో పేదల కష్టాలను పట్టించుకోకుండా విలాసాలకు పాల్పడే ప్రభుత్వాలను ఏమనాలి ? అది పాలకులకే తెలియాలి. ఏది ఏమైనా జనం వారిని నమ్మి ఓట్లు వేసినందుకు జనానికి వారు చక్కగానే బుద్ధి చెబుతున్నారు..!!