వైయస్ఆర్ జయంతి రోజే..జగనన్న స్వచ్చ సంకల్పం : జగన్ సర్కార్ భారీ ప్లాన్

జూలై 8న “జగనన్న స్వచ్ఛ సంకల్పం” పేరుతో మరో అభివృద్ది కార్యక్రమాన్ని చేపడుతున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని.. గ్రామాలను స్వచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దడం కోసమే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకువస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇది వంద రోజుల కార్యక్రమని..ఇవాళ సన్నాహక సమావేశం అందరు సర్పంచ్ లతో వర్చువల్ గా నిర్వహిస్తామన్నారు.

గ్రామంలో అంటువ్యాధులు రాకుండా, శుభ్రతపై దృష్టి పెడతామని.. మన ఇల్లే కాదు వీధి, గ్రామం కూడా శుభ్రంగా ఉండేలా అందరూ చూసుకోవాలని పేర్కొన్నారు. 15వ ఆర్ధిక సంఘం ద్వారా శానిటేషన్ కోసం రూ. 1312.40 కోట్లు కేటాయించారని..వంద రోజుల కార్యక్రమంలో పాల్గొని చక్కగా పని చేసిన వారికి సన్మాన కార్యక్రమం కూడా చేపడుతున్నామని తెలిపారు. సర్పంచ్ లు అందరూ కష్టపడి పని చేయాలని.. పని చేయకుండా వివక్ష చూపించే సర్పంచుల పై చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు పెద్దిరెడ్డి.