ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అనేక రంగాలపై పడింది. ఇప్పటికే ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. రాబోయే రోజుల్లో దేశంలో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని తెలుస్తోంది. ఇక అనేక రంగాలు తీవ్రమైన నష్టాల్లో కొనసాగుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఇంకా ఎక్కువగా పడనుంది. ఈ క్రమంలో మరోవైపు.. పత్రికా రంగం కూడా ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావాన్ని ఎదుర్కొంటోంది.. దీంతో రానున్న రోజుల్లో పత్రికా రంగానికి చెందిన జర్నలిస్టులు, నాన్-జర్నలిస్టులకు ముప్పు పొంచి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలో అనేక చోట్ల ఇప్పటికే చాలా మంది పత్రికలను తీసుకోవడం లేదు. పేపర్ బాయ్‌లు పేపర్ వేసేందుకు వస్తే.. వారిని అటు నుంచి అటే వెనక్కి పంపించేస్తున్నారు. దీంతో ఏజెంట్లు పేపర్లను తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు పత్రికల యాజమాన్యాలు టాబ్లాయిడ్లను తీసేసి పూర్తిగా మెయిన్ పేజీలనే.. అది కూడా కేవలం కొద్ది పేజీలతో.. తక్కువ సంఖ్యలో పత్రికలను ప్రింట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పత్రికల యాజమాన్యాలు తీవ్రమైన నష్టాల బారిన పడనున్నాయనే విషయం స్పష్టమవుతోంది. దీంతో దేశంలోని పత్రికల్లో పనిచేస్తున్న కొన్ని లక్షల మంది సిబ్బంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
కరోనా వల్ల మరో 2 లేదా 3 నెలల్లో అనేక లక్షల మంది ఉద్యోగాలను కోల్పోతారని, అందులో వీరు కూడా ఉంటారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పత్రికల యాజమాన్యాలు ఈ విషయం పట్ల తర్జనభర్జనలు పడుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జనాలు డిజిటల్ మాధ్యమం వైపే మొగ్గు చూపుతున్నారు.. మరోవైపు కరోనా వల్ల పత్రికలను ముట్టుకోవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిజానికి పత్రికల వల్ల కరోనా వ్యాపిస్తుందనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయమై ఇప్పటికే స్పష్టంగా ప్రకటించింది. ఈ విషయంపై పలు ప్రధాన తెలుగు పత్రికలు తమ పత్రికల్లో కథనాలను ప్రచురించినా జనాలు వాటిని నమ్మడం లేదు. దీంతో చాలా మంది పత్రికలను తీసుకోవడం లేదు.
అయితే కరోనా ప్రభావం తగ్గి ముందు ముందు మళ్లీ పత్రికల కాపీలను పెంచినా జనాలు అప్పటి వరకు డిజిటల్ మాధ్యమాలకు అలవాటు పడతారు కనుక.. వారు మళ్లీ పత్రికలను చదువుతారా.. లేదా.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో పత్రికలను కొన్నాళ్ల పాటు మూసివేయడమే మంచిదని కొన్ని పత్రికల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. అయితే ఈ విషయం సంగతి ఎలా ఉన్నా.. పత్రికలకు వస్తున్న తీవ్రమైన నష్టాల దృష్ట్యా కొంత వరకు ఉద్యోగాలకు కోత పడుతుందని తెలుస్తోంది. మరి ముందు ముందు ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి..!