నాన్నా.. చెల్లి జాగ్రత్త..! – ప్రియాంక రాయని లేఖ…!

-

ప్రియమైన నాన్నగారికి..

నేను నోరులేని పశువులకు వైద్యం చేస్తాను. ప్రాణం పోస్తాను.. కాని నోరున్న పశువులు నా ప్రాణం తీసాయి… నా భాష రాని మూగ జీవాలు… హేయ్ అని అరవగానే ఆగిపోయి నాకు సహకరిస్తాయి. వైద్యం చేయించుకుంటాయి… నా కాలు తొక్కితే,  వీపు మీద ఒక దెబ్బ వేయగానే కాలు తీస్తుంది… కొన్నయితే … నా కాళ్ళను తొక్కకుండా జాగ్రత్తగా ఉంటాయి… కానీ, నాకు సహాయం చేయండి అన్నయ్యా అని అడిగాను కదా… నా భాష అర్ధమవుతుంది కదా… నేను రోజూ చూసే మనిషే కదా…?

ఒంటరిగా ఉంటే నాలో కామం కనపడిందా…? నా బండి పంచర్ పడటం నా తప్పా నాన్నా…? వాళ్ళను సహాయం అడగడం నా తప్పా…? మూగ జీవాలు నన్ను ఒక మనిషిలా చూస్తే… నోరున్న మనుషులు నన్ను కేవలం ఒక ఆడదానిలా చూసారు… ఏడుపొస్తోంది నాన్నా… బెడ్ రూమ్ లోకి వెళ్లి చెల్లితో కలిసి ఏడవాలని ఉంది… అమ్మ ఒళ్లో పడుకోవాలని ఉంది… నీతో తల నిమిరించుకోవాలని ఉంది… నాకు ఇప్పుడు ఏం నొప్పి తెలియడం లేదు… నన్ను చంపేశారుగా… నా శరీరం మొత్తం కాలిపోయింది… నా శరీరంలో నేను కాపాడుకున్న ఏ ఒక్కటి కూడా నేను కూడా చూసుకోకుండా చేసేసారు.

నీకు చెప్పలేను… అమ్మకు చెప్పలేను… చెల్లితో షేర్ చేసుకోలేను…ఎంత చదువుకున్నా నేనూ ఆడపిల్లనే కదా నాన్నా..

భవ్యా… నీకు ఒకటి చెప్తున్నాను… జాగ్రత్త..! బయటకు రావొద్దు… నువ్వు నాకంటే చిన్న దానివి. తట్టుకోలేవు… నను మృగాలు చీల్చాయి… ఆ క్రూరమృగాల మధ్యలోకి నువ్వు రావొద్దు… అమ్మా నాన్నకు ఇక నువ్వే ఉన్నావు… అమ్మని, నాన్నని బాగా చూసుకుంటావు కదూ…

నాన్నా… చెల్లి జాగ్రత్త… ఈ జనారణ్యంలోకి పంపకు నాన్నా… అమ్మని కూడా… నా చెల్లిని కాపాడు నాన్నా… పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలనుకున్నాను నాన్నా… నా తప్పుంటే క్షమించు నాన్నా…

– నీ ప్రియాంక…

ప్రియాంక పవిత్రమైన ఆత్మ మన చుట్టే తిరుగుతుంది.. తను ఏదో చెప్పాలనుకుంటుంది.. తన బాధ ఇది అని నా మనసుకు తోస్తుంది. ఆ అభాగ్యురాలు తన తండ్రికిలా చెప్పమంటుందా.. ఏమో.. ఉండవచ్చు.. ఈ లేఖ సారాంశం అర్థమైతే చాలు..

Read more RELATED
Recommended to you

Latest news