ఏపీలో కూడా తెలంగాణ మాదిరిగానే నాశనం అవుతున్న టీడీపీ

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎందుకు నాశనం అయిపోయింది అంటే చాలా మంది చెప్పే మాట అనుబంధ సంఘాలను బలోపేతం చేయకుండా నాయకత్వాన్ని తేలికగా తీసుకోవడం తోనే అక్కడ పార్టీ నాశనమైపోయింది అనేది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపు అదే విధంగా ఆ పార్టీ పరిస్థితి ఉంది. ఒక పక్క వైసిపి అన్ని విధాలుగా బలోపేతం కావడానికి క్షేత్రస్థాయిలో కృషి చేస్తోంది. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి వైసీపీ నేతలు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోక పోయినా సరే సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పదవతరగతి వైసీపీ అభిమాని కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా చెబుతూ ఉంటాడు.

కానీ పాపం తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేక పోతుంది. దానికి ప్రధాన కారణం పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే. అనుబంధ సంఘాల కు చెందిన అధినేతలు మాట్లాడకపోవడమే. గతంలో తెలుగు యువత తెలుగు రైతు తెలుగు కార్మిక సంఘం వంటివి చాలా బలంగా ఉండేవి. ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసీ సెల్ వంటివి కూడా చాలావరకు బలంగానే ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్లే విధంగా అప్పటి నాయకులు చాలావరకు ప్రయత్నాలు చేశారు. విద్యార్థి విభాగాలు కూడా చాలా సమర్థవంతంగా పని చేసిన పరిస్థితి మనం అప్పట్లో చూశాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో కనపడటం లేదు. అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. తెలుగు యువతకు ఎలాగో నాయకుడు లేరు. యువ నాయకులు పదవుల కోసం ఎదురు చూస్తున్న ఇచ్చే పరిస్థితి పార్టీలోనూ లేదు.

ఇక ఇప్పుడు అనుబంధ సంఘాలు విఫలం కావడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లోపం అని ఆ పార్టీ నేతలే బహిరంగంగా అనే పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి అనే ఆలోచన కూడా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి లేదు అనేది ఆ పార్టీ నేతలు కూడా చేస్తున్న వ్యాఖ్య. ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అంటే అనుబంధ సంఘాల అవసరం అనేది చాలా ఉంటుంది. ప్రజలను అన్ని విధాలుగా ముందుకు నడిపించటానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పును చెప్పడానికి ఈ అనుబంధ సంఘాలు చాలా. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అప్పులు చేసే చేస్తున్నాయి. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే నాయకుడు అంటూ ఒక్కరు కూడా లేరు. పదవులు అనుభవించిన వారు ఎలాగూ సైలెంట్ గా ఉన్నారు… పదవుల కోసం ఎదురు చూస్తున్న వారు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు.

కానీ వారిని వాడుకొనే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటివరకు తెలుగు యువత అధ్యక్షుడు నియమించలేదు. ఇతర అనుబంధ సంఘాల నాయకులను కూడా నియమించే పరిస్థితి లో తెలుగుదేశం లేదు. ఎంతసేపు అమరావతి ఉద్యమం లేకపోతే దళితులపై దాడులు లేకపోతే హిందూ మతానికి సంబంధించిన అంశాలను భుజానికెత్తుకుని మరో మతానికి దూరం కావడం మినహా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేస్తున్న కార్యక్రమాలు అంటూ ఏ ఒక్కటీ లేదు. అంతర్వేది ఘటన విషయంలో తెలుగుదేశం పార్టీ కాస్త అతిగా స్పందించింది. బిజెపి కంటే కూడా ఎక్కువగా చంద్రబాబునాయుడు పూసుకున్నారు. అవి పక్కనపెట్టి పార్టీ బలోపేతం మీద దృష్టి సారించకపోతే మాత్రం పార్టీ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా చంద్రబాబునాయుడు మేల్కొని పార్టీ భవిష్యత్తు మీద దృష్టి సాధించకపోతే మాత్రం పార్టీకి భవిష్యత్తు ఉండదు అనేది చాలా మంది చెప్తున్న సలహా.