విశాఖ ఉక్కు గురించి అంతా మాట్లాడుతున్నారు. ప్రయివేటీకరణకు సంబంధించి వ్యతిరేకంగా నినాదాలు వినిపిస్తున్నాయి. ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.అయినా కూడా కేంద్రం ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ప్లాంటు అమ్మకానికి సంబంధించి పనులను ముమ్మరం చేస్తూనే ఉంది. ప్లాంటుకు సంబంధించి ఆస్తుల విక్రయం కూడా షురూ చేస్తోంది.దీంతో ఉద్యోగులు అగమ్యగోచరంగా ఉన్నారు. ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నారు.
కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడితే అన్నం పెట్టేదెవరు అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. నష్టాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం అన్నది సబబు కాదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.ఈ దశలో కేటీఆర్ సీన్లోకి వచ్చారు.నిన్నటి తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ విధానాలనకు వ్యతిరేకంగా గొంతు వినిపించారు. ప్రయివేటీకరణ వద్దని ప్లాంటును కాపాడాలని ఏడాది పైగా నిరసనలు చేస్తూ ఉన్నా అవేవీ కేంద్రం పట్టించుకోవడం లేదు అని విశాఖ వీధులలో సాగుతున్న పోరు తీరు గురించి కూలంకుషంగా వివరించారు. ఆంధ్రాలో అయితే బీజేపీ ఆటలు చెల్లవచ్చునేమో కానీ తెలంగాణలో అస్సలు చెల్లవని స్పష్టం చేస్తూ, కేంద్రం తీరును తూర్పారబట్టారు.
కేసీఆర్ స్టేట్మెంట్ తో ఇటు ఆంధ్రాలోనూ ఆనందం వ్యక్తం అవుతోంది. ప్లాంటు సమస్యను జాతీయ స్థాయిలో వినిపించాల్సిన జగన్ అస్సలు పట్టించుకోవడం లేదు అని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ దశలో పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెద్దలు తమ వంతు బాధ్యతగా ప్లాంటును ప్రయివేటీకరణ చేయవద్దని ఇది ఉమ్మడి ఆంధ్రాలోప్రాణాలకు తెగించి సాధించుకున్న పరిశ్రమ అని కేటీఆర్ లాంటి నాయకులు పదే పదే చెబుతూ గగ్గోలు పెడుతూ ఉంటే, ఇక్కడ అధికారంలో ఉన్న
జగన్ వర్గం మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోవడం మాత్రం అస్సలు సబబు కాదని, ఇప్పటి పాలకులను చరిత్ర క్షమించదని వామపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ దశలో కేటీఆర్ కు విశాఖ వాసులే కాదు ఆంధ్రా ప్రజలు కూడా ధన్యవాదాలు చెబుతున్నారు. నాయకులు బాధ్యతగా వ్యవహరించి ప్రాంతాలకతీతంగా సమస్యలపై స్పందిచినప్పుడే ప్రజా ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు పది కాలాల పాటూ వర్థిల్లుతాయని ప్లాంటు పరిరక్షణ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.