నాయకుల తీరు మారుతుంది… ఆదర్శమా పాడా!

-

గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లోని విమర్శల్లో.. మాటల తూటాలు పరిధి దాటుతున్నాయి. ఒకప్పుడు నాయకులు చాలా ఆదర్శంగా ఉండేవారు. వారి ప్రవర్తన ఆదర్శంగా ఉండేది. వారి మాటతీరు ఆదర్శంగా ఉండేది. కానీ నేటినాయకులకదేది? సినిమా డైలాగుల ప్రభావం, పంచు డైలాగుల ఎఫెక్ట్ నేటి నాయకులపై పనిచేస్తుందో ఏమో కానీ… కాస్త ఆలోచించి మాట్లాడలేకపోతున్నారు. పంచ డైలాగులు, ఊరమాస్ మాటల మాయలోపడి ఇంగితం కోల్పోతున్నారు.

రాజకీయాలు ఒకప్పుడు చాలా హుందాగా ఉండేవి! రాజకీయ నాయకుల ప్రవర్తన, మాటతీరు చాలా హుందాగా ఉండేది! అయితే అది గతం!! ఇప్పుడు విమర్శల్లో ఎన్ని బూతులు, ఎన్ని అసభ్యపదాలు, ఎన్ని వ్యక్తిగత విమర్శలు కలిపితే అంత “మాస్ లీడర్” అనే రోజులు వచ్చేశాయి! నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి.. కేడర్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవాలా? లేక, కేడర్ కి అలాంటివి నచ్చుతాయనే.. నాయకులు మాట్లాడుతున్నారని భావించాలా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ మ‌రీ విప‌రీతంగా మారింది. ప్ర‌భుత్వంలో ఉన్న నాయ‌కుల ద‌గ్గ‌ర నుండి ప్ర‌తిప‌క్షం వ‌ర‌కు ఎవ‌రూ త‌గ్గ‌టంలేదు. మ‌ర్యాద అనే ప‌దానికి తావులేకుండా, నోటికి ఎంతొస్తే అంత అనేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు, బోండా ఉమ ల రూపంలో అసెంబ్లీ సాక్షిగా “బూతు”లు ధ్వనించడం అప్పట్లో రచ్చ లేపిన అంశం! దాన్ని కంటిన్యూ చేస్తున్నారని భావించాలో లేక వారికంటే తమకు “బాగా వచ్చు” అని చెప్పాలనుకుంటున్నారో తెలియదు కానీ… వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత టీవీ డిబేట్లలో వల్లభనేని వంశీ.. ఇక అసెంబ్లీ లోపలా, వెలుపలా అని తేడా ఏమాత్రం చూడకుండా కొడాలి నాని చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే!

ఈ లిస్ట్ లో వైకాపా ఎమ్మెల్యే మెరుగు నాగార్జున – టీడీపీ నేత ఎం.ఎస్. రాజు లు తాజాగా వారి వారి పాండిత్యాన్ని కూడా మైకులముందుంచారు! అబ్బే అక్కడికీ నెంబర్ సరిపోవడంలేదనుకున్నారో ఏమో కానీ.. మరో టీడీపీ నేత పిల్లి మాణిక్య రావు కూడా తోడయ్యారు.. మైకులముందు “పీకు”లాటలగురించి మాట్లాడటం మొదలుపెట్టారు!

ఇప్పుడు టీడీపీ మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు.. తన “సీనియారిటీ”ని చూపించే పనికి పూనుకున్నారు. జగన్ ని పట్టుకుని పిచ్చి రెడ్డి, తుగ్లక్ రెడ్డి అంటూ వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తున్నారు. హుందాతనం అనే విషయం వదిలేశామని పరోక్షంగా ప్రజలకు చెబుతున్నారు. తనకు వయసు పెరిగినమాట వాస్తవమే కానీ… ఇంగితం తక్కువని ఒప్పేసుకుంటున్నారు! ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించాలంటే.. విమర్శించాలంటే ఇదే విధానం కాదని గ్రహించలేకపోతున్నారు!

ప్రస్తుతం పార్టీలో అందరినీ దాటేసి ముందుకెళ్లిపోవాలని భావిస్తున్న చినబాబు లోకేష్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయారు. తాను కూడా ఎవరికి తక్కువకాదని, తనకూ ఆ పాండిత్యం ఉందంటూ.. జగన్ పై వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు.

ఆంద్ర‌ప్ర‌దేశ్ ప‌రిస్థితి ఇలా ఉంటే తెలంగాణ‌లో కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. స‌న్నాసీ, ద‌ద్ద‌మ్మ‌లాంటి ప‌దాలు క‌మాన్ అయ్యాయి. పంచ్ డైలాగ్‌లు, స‌వాల్‌లు విసిరేందుకు కాంగ్రెస్ నుండి రేవంత్‌, బీజేపీ నుండి బండి సంజ‌య్‌, టీఆర్ఎస్ నుండి అయితే చాలామందే ఉన్న‌రు. బీజేపీ ఛీఫ్ బండి సంజ‌య్ కి, మైనం ప‌ల్లికి మ‌ద్య వార్ ఎంత‌లా ప‌రిధులు దాటిందో చూశాం. నేనేమ‌న్నా త‌క్కువ తిన్నానా అనుకున్న‌ మంత్రి మ‌ల్లారెడ్డి తొడ‌గొట్టి స‌వాల్ పీక్స్ చేర్చేశారు. మొత్తంగా తెలుగు రాష్ట్ర‌ల్లోని ప్ర‌స్తుత ప‌రిస్థితి అద్వాన్నంగా ఉంద‌న‌డంలో సందేహం లేదు.

నాయకులు ఎందుకు ఇలా మారిపోతున్నారు.. ఆదర్శన్ని ఎందుకు మరుస్తున్నారు.. ఇంగితాన్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఇకనైనా మారతారని ఆశిద్ధాం.. మారాలని కోరుకుందాం..!!

Ch. RAJA

Read more RELATED
Recommended to you

Latest news