కరోనా కారణంగా దేశంతో ఎంతో మంది విద్యార్థులు ఈ సారి పరీక్షలు రాయలేకపోయారు. పలు చోట్ల 10వ తరగతితోపాటు ప్లస్ 1, ప్లస్ 2 పరీక్షలు, ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఆగిపోయాయి. ఇక విద్యార్థులకు ఇప్పుడప్పుడే తిరిగి పరీక్షలు నిర్వహించే అవకాశాలు కూడా ప్రభుత్వాలకు కనిపించడం లేదు. దీంతో 1 నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులను ఇప్పటికే ప్రభుత్వాలు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేశాయి. ఇక మిగిలిన విద్యార్థుల పరీక్షల పరిస్థితి ఏమిటి, వారికి ఎగ్జామ్స్ నిర్వహించాలా, వద్దా, ఎలా నిర్వహించాలి.. అని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. అయితే నిపుణులు సూచిస్తున్న ప్రకారం.. ఈ ఏడాది విద్యా సంవత్సరం జూలైలో కాకుండా సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కరోనా మహమ్మారి లాంటి సమస్యను నిజానికి ప్రభుత్వాలు ఇప్పటి వరకు హ్యాండిల్ చేయలేదు. అందువల్ల పాలకులకు విద్యార్థుల పరీక్షల విషయమై ఏం చేద్దామనే అంశంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా ఏర్పాటు చేసిన రెండు నిపుణుల కమిటీలు విద్యార్థుల పరీక్షల విషయమై పలు అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వాలకు సూచనలు చేశాయి. దాని ప్రకారం.. ఈ ఏడాది విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే.. జూలైలో కాకుండా సెప్టెంబర్‌లో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని వారు అంటున్నారు.
ఇక సెప్టెంబర్‌లో విద్యా సంవత్సరం ప్రారంభం అయితే.. జూలై నుంచి అప్పటి వరకు దాదాపుగా 3 నెలల విద్యాసంవత్సరాన్ని కోల్పోతారు. ఈ క్రమంలో ఆ సమయాన్ని కవర్ చేయాలంటే.. ప్రభుత్వాలు విద్యార్థులకు దాదాపుగా అన్ని ప్రభుత్వ హాలిడేలను రద్దు చేసే అవకాశం ఉంటుంది. అలాగే దసరా, సంక్రాంతి వంటి సమయాల్లో సెలవులను పూర్తిగా రద్దు చేయడంతోపాటు వచ్చే ఏడాది వేసవిలో 30 నుంచి 45 రోజుల వరకు విద్యా సంవత్సరాన్ని అటు వైపు పొడిగించే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఈ విషయంలో ఏం చేస్తాయో చూడాలి..!