దేశంలో ఇప్పుడు ప్రభుత్వాలు ఏర్పడాలి అంటే సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యాల్సిందే. సంక్షేమ కార్యక్రమాల హామీలు ఎన్నికల్లో ఇవ్వాల్సిందే. అప్పుడే రాజకీయ పార్టీలు గద్దెను ఎక్కేది, పాలించేది. అభివృద్ధి, మంచితనం ఇవన్ని ఇప్పుడు రాజకీయాల్లో పులిహోర కబుర్లు. అందుకే సంక్షేమ కార్యక్రమాలు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. పార్టీల మేనిఫెస్టోలో సంక్షేమ కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పరిస్థితి.
రైతులకు ఇచ్చే ఆర్ధిక సహాయం మినహా ప్రతీ సంక్షేమ కార్యక్రమం కూడా ఇప్పుడు ప్రభుత్వాల మీద అధిక భారం వేసేస్తున్నాయి. అసలు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం వలన ప్రజలకు మేలు కంటే నష్టమే ఎక్కువ అనేది విశ్లేషకుల అభిప్రాయం. మేధావులు కూడా ఈ భావనతో ఏకీభవిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే అవసరమైన, అనవసరమైన ఖర్చులు ప్రభుత్వానికి ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాల అమలులోనే జరుగుతున్నాయనేది వాస్తవం.
పేరుకు ప్రజల మేలు కొరకు ఏర్పరచే ఈ సంక్షేమ పథకాలు ఇటు ప్రజలకు,అటు ప్రభుత్వానికి భారం అవుతున్నాయి. వీటి అమలు కొరకు ప్రభుత్వాలు అప్పుల మీద అప్పులు చేస్తున్నాయి. వీటిని తీర్చేది ప్రజలే కదా. పన్నుల రూపంలోనూ, చార్జీల రూపంలోనూ, ఇలా ఎదో ఒక రూపంలో ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చేది ప్రజలే. ప్రభుత్వాలు మారతాయి కానీ వారు సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలకు తాయిలాలు అందించడానికి చేసిన అప్పులు సంగతి ఏంటి ?
దీని గురించి ఆలోచించే వారు ఎవరు..? రాష్ట్రానికి ఆదాయం సంవృద్ది గా లభిస్తే చదువు, వైద్యం, వంటి కొన్ని ఉపయోగకరమైన సంక్షేమ పథకాలు తీసుకువచ్చి వాటిని పూర్తి ఉచితంగా ప్రజలకు అందించడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చు. ప్రభుత్వాల మీద సంక్షేమ పథకాల భారం మోపడం పట్ల నష్టపోయేది ప్రజలే. ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే ఇది పూర్తిగా సాధ్యం అవుతుంది. ఏటా వేల కోట్లు ప్రభుత్వాలు అప్పులు తెస్తున్నాయి అంటే ఇదే కారణం. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి.