ఎట్టకేలకు ఒక బాధాకరమైన నిరీక్షణ ముగిసింది. నిర్భయ దోషులను మరణం వరించింది. వీరి ఉరిశిక్షను వాయిదా వేయించడానికి, తద్వారా శిక్ష తగ్గించేందకు వాళ్ల వకీలు ఏపీ సింగ్ చేయరాని ప్రయత్నాలన్నీ చేసాడు. ఏం ఆశించి ఆయన ఈ కేసును వాదించాడనేది ఎవరికీ తెలియదు.
16 డిసెంబర్ 2012, రాత్రి 9.30 గంటల సమయం. దక్షిణ ఢిల్లీలోని మునిర్కా ప్రాంతం. గడ్డకట్టించే చలి. నిర్భయ అనే 23 ఏళ్ల అమ్మాయి, తన స్నేహితుడు అవీంద్ర ప్రతాప్ పాండేతో కలిసి ఫస్ట్ షో ‘లైఫ్ ఆఫ్ పై’ అనే సినిమా చూసి తిరిగి వస్తున్నారు. ఇంటికెళ్లడానికి బస్‌స్టాప్‌కు వచ్చారు. అక్కడ ఉన్న ఒక ప్రయివేటు బస్సులోకి ఎక్కారు. అందులో డ్రయివర్‌తో సహా ఆరుగురు వ్యక్తులున్నారు. అందులో ఒకడు పిల్లాడు. విపరీతంగా తాగున్నారు. బస్ కదలగానే డోర్లు మూసేసి దారుణానికి ఒడిగట్టారు. ఆ అబ్బాయిని తీవ్రంగా కొట్టి, పక్కకు పడేసి, అమ్మాయిని అత్యంత దారుణంగా హింసిస్తూ, అత్యాచారం చేసారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ మారణకాండ, జరుగుతున్నంతసేపు డ్రయివర్ బస్సును ఢిల్లీ వీదుల్లో తిప్పుతూనే ఉన్నాడు. ఆ తర్వాత వారిద్దరిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన కాళరాత్రిగా ఆ రాత్రి మిగిలిపోయింది. తుత్తునియలైన శరీరంతో విలవిలలాడుతున్న ఆ అమ్మాయిని హాస్పిటల్‌లో చేర్చినా, అక్కడ ట్రీట్‌మెంట్ సాధ్యంకాక, సింగపూర్‌కు తరలించారు. అక్కడ ప్రాణాలకోసం పోరాడుతూ ఓడిపోయిన నిర్భయ పదమూడు రోజుల అనంతరం కన్నుమూసింది. మరణవాంగ్మూలమిస్తూ, ఆ ఆరుగురిని ఉరితీయాలని కోరింది.
ఆ ఆరుగురిని గుర్తించి, అరెస్టు చేసిన పోలీసులు, పకడ్బందీగా కేసును ఫైల్ చేసారు. కోర్టులో వాదోపవాదాలు జరుగుతుండగానే ఒక నిందితుడు, బస్సు డ్రయివర్ రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు, మిగిలిన అయిదుగురిలో మైనర్‌ను మూడేళ్లపాటు బాలనేరస్థుల గృహంలో ఉంచాల్సిందిగా ఆదేశించిన కోర్టు, నలుగురికి ఉరిశిక్ష విధించింది. అప్పుడు మొదలైన ఆ ఆట ఇంకా ముగియలేదు.
ఇప్పుడు 2020వ సంవత్సరం. ఆ సంఘటన జరిగి ఎనిమిదేళ్లు. ఇంకా నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కాలేదు. ఎప్పుడవుతుందో ఎవరికీ తెలియదు. దోషుల తరపున లాయర్‌గా ఏపీ సింగ్ వకాల్తా పుచ్చుకున్నాడు. నాటి నుంచి నేటివరకు అయన దోషులను కాపాడటానికి చేయని ప్రయత్నమంటూ లేదు.
ప్రసిద్ధ సుప్రీంకోర్టు లాయర్లయిన ఏపీ సింగ్ అండ్ కంపెనీ, కేసును వాదించడానికి చాలా పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేస్తారు. నిరుపేదలైన దోషుల కుటుంబీకులకు ఆ ఫీజులో కనీసం 1 శాతం కూడా చెల్లించే సామర్థ్యం లేదు. కానీ గత ఎనిమిదేళ్లుగా కేసు నడుస్తూనేఉంది. మరి ఈ ఫీజులు ఎవరు భరిస్తున్నారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఢిల్లీ అడ్వకేట్లందరూ ఈ కేసులో నిందితుల తరపున వాదించకూడదని నిర్ణయం తీసుకున్నా, ఏపీ సింగ్ మాత్రం ముందడుగేసి కేసు టేకప్ చేసాడు.
ఆయన ఈ కేసును దోషుల మీద జాలితో కన్నా, బలైపోయిన అమ్మాయి మీద కోపంతోనే వాదిస్తున్నట్లు పలుమార్లు ఆయన మాటల ద్వారా రుజువయింది. ‘‘ నా కూతురో, చెల్లలో ఇలా అర్ధరాత్రి బాయ్‌ఫ్రెండ్‌తో షికార్లు చేసుంటే, పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటే, నా కుటుంబం ముందే పెట్రోల్ పోసి, తగులబెట్టేవాడిని’’ అంటూ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
యావద్దేశం ఆయన చర్యలను, మాటలను గర్హిస్తున్నా , సింగ్ లెక్కచేయలేదు. కోర్టు హాల్లో ‘అసలు వీన్నే ముందు ఉరి తీయాలి’ అనే మాటలు సందర్శకుల నుంచి వినిపించినా పట్టించుకోలేదు. న్యాయవ్యవస్థలోని లోపాలను సాకుగా చేసుకుని, ఆయన ఉరిని వాయిదాల మీద వాయిదాలు వేయిస్తున్నాడు. ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఈ ‘వాయిదా ఎత్తుల’ను పలుమార్లు ఖండించి, వార్నింగ్ ఇచ్చినా, బార్ కౌన్సిల్ నోటీసులిచ్చినా ఆయన మారలేదు.
హైదరాబాద్‌లో ఈమధ్య జరిగిన ఇలాంటి కేసు ‘దిశ’. ఇక్కడ పోలీసులు నిందితులను తప్పించుకునే ‘ప్రయత్నం’ చేయగా కాల్చివేసారు. దేశవ్యాప్తంగా ఈ ఎన్‌కౌంటర్ పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ పోలీసులపై పూలవర్షం కురిపించారు. సత్వరన్యాయమంటే ఇలా ఉండాలి అంటూ రాజకీయనాయకులు, సెలెబ్రిటీలు, మంత్రులతో సహా అభినందించారు. కానీ ఇక్కడా మానవహక్కులపేరుతో కమీషన్లు, కార్యకర్తలమంటూ కొంతమంది కుహనా మేధావులు పోలీసులపై కేసు వేసారు.
నిర్భయ తల్లి ఆశాదేవి ఉరిశిక్ష కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నా, కోట్లాదిమంది ఉరిశిక్షను కోరుకుంటున్నా, సింగ్ అదరడం, బెదరడం లేదు. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేయించి ఆఖరికి ఉరిశిక్షను యావజ్జీవశిక్షగా మార్పించాలనేది సింగ్ ఆలోచన. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ ఉరిశిక్ష పడనివ్వను’’ అని ఆశాదేవితో సింగ్ చాలెంజ్ చేసినట్లు ఆమె కోర్టు మెట్ల మీద భోరుమంటూ మీడియాకు గోడు వెళ్లబోసుకుంది.
నిందితులకు మరణశిక్ష విధించడం కేవలం రాజకీయాల కోసం, ఓటు బ్యాంకుల కోసమంటూ జడ్జితో వాగ్వాదానికి దిగిన అజయ్ ప్రతాప్ సింగ్, గత ఎనిమిదేళ్ల నుండి తన ఫీజు ఎవరు చెల్లిస్తున్నారో, అది రాజకీయమెలా కాదో ఇంకా చెప్పదలుచుకోలేదు. ఇక చెప్పడు కూడా. కానీ భారత న్యాయవ్యవస్థ ఎంత భ్రష్టుపట్టిపోయిందో, అది ఎంత లోపభూయిష్టమో ఆయన రుజువులతో సహా చెప్పగలిగాడు.
-రుద్రప్రతాప్