దేశవ్యాప్తంగా అమలవుతున్న మూడో విడత లాక్‌డౌన్‌లో భాగంగా కేంద్రం అనేక ఆంక్షలకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే దేశంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇక ఇటీవలే మద్యం షాపులకు కూడా అనుమతిచ్చారు. దీంతోపాటు పలు ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను తెరిచేందుకు కూడా అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజలు మళ్లీ యథాప్రకారం రోడ్లపైకి రావడం మొదలు పెట్టారు. అయితే కేంద్రం ఇచ్చిన ఈ ఆంక్షల సడలింపు మళ్లీ కొంప ముంచుతుందా..? సెకండ్ వేవ్ రూపంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఇటీవలే లాక్‌డౌన్ అనంతరం పలు ఆంక్షలకు సడలింపులు ఇచ్చారు. అక్కడ కూడా వ్యాపార వాణిజ్య సముదాయాలు, బార్లు, క్లబ్బులు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే గత 2, 3 రోజుల వ్యవధిలోనే దాదాపుగా 50కి పైగా కరోనా కేసులు ఒక్క సియోల్ చుట్టు పక్కలే నమోదయ్యాయి. అలాగే ఆదివారం ఒక్క రోజే 34 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈ క్రమంలో కరోనా బారిన పడిన వారు తిరిగిన ప్రదేశాలలో మొత్తం 7500 మంది తిరిగారని తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన దక్షిణ కొరియా తిరిగి అన్న సముదాయాలు, బార్లు, క్లబ్బులను మూసేసింది.
ఇక భారత్‌లోనూ ప్రస్తుతం జోన్ల వారీగా ఆంక్షలను సడలిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం జనాలు ఇంకా వినడం లేదు. సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ట్రాఫిక్ జాంలను సృష్టిస్తున్నారు. దీంతోపాటు పలు చోట్ల కొందరు మాస్కులను ధరించడం లేదు. భౌతిక దూరం అస్సలు పాటించడం లేదు. ఈ క్రమంలో కరోనా మళ్లీ తిరగబెట్టి.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోనూ సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ కరోనా విజృంభిస్తే.. అప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుందని అంటున్నారు. కనుక ప్రజలు లాక్‌డౌన్ నిబంధనలను పాటించేలా చూడాలని.. పలువురు కోరుతున్నారు.