జేఈఈ మెయిన్‌లో భారీ మార్పులు

130

– ప్రశ్నల సంఖ్య 90 నుంచి 75కి తగ్గింపు
– స్కీం&సిలబస్‌లో మార్పులు
– 60 ఆబ్జెక్టివ్ (mcq), 15 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు
– 360 మార్కుల నుంచి 300 మార్కులకు తగ్గిన మొత్తం మార్కులు

దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఈసారి భారీగా మార్పులు చేశారు. నిఫుణుల కమిటీ సిఫారసుల మేరకు స్కీం అండ్ సిలబస్‌లో భారీ మార్పులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సంస్కరణలు తీసుకుచ్చింది.
పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నల సంఖ్యతోపాటు ప్రశ్నల విధానాన్ని కూడా మార్చేసింది. ఈ మేరకు మార్పు చేసిన జేఈఈ మెయిన్ పరీక్ష కొత్త విధానాన్ని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో అందుబాటులో ఉంచింది. ఆబ్జెక్టివ్ విధానమే కాకుండా డిస్క్రిప్టివ్ విధానాన్ని కూడా తీసుకురావాలని భావించిన ఎంహెచ్‌ఆర్‌డీ.. ఈ మేరకు గతంలోనే నిఫుణల కమిటీని ఏర్పాటు చేసింది. అయితే డిస్క్రిప్టివ్ విధానం కాకుండా సంఖ్యా సమాధాన (న్యూమరికల్ వాల్యూ) సంబంధిత ప్రశ్నలను జేఈఈ మెయిన్ పరీక్షల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఈ విధానం ఉండగా, ఇపుడు మెయిన్‌లోనూ ప్రవేశపెట్టింది. గతేడాది నుంచి జేఈఈ మెయిన్ రెండుసార్లు (జనవరి, ఏప్రిల్)లో నిర్వహిస్తున్న విషయం విదితమే.

Major Change In JEE Main
Major Change In JEE Main

300 మార్కులు- 75 ప్రశ్నలు

జేఈఈ మెయిన్‌లో ఇప్పటివరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 30 చొప్పున మొత్తం 90 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుండేవి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 360 మార్కుల కు ప్రశ్నపత్రం ఉండేది. నెగిటివ్ మార్కుల విధానం ఉండేది. ఒక తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేసేవారు. కొత్త విధానంలో ప్రతి ప్రశ్నకు 4 మార్కులే ఇవ్వనున్నప్పటికీ, ప్రశ్నల సంఖ్యను 75కి కుదిం చారు. ప్రతి సబ్జెక్టు నుంచి గతంలో 30 ప్రశ్నలు ఉండగా..వాటిని 25కి తగ్గించారు. ఆ 25 ప్రశ్నల్లోనూ ఆబ్జెక్టివ్ విధానంలో 20 ప్రశ్నలు.. సంఖ్యా సమాధాన పద్ధతిలో మరో 5 ప్రశ్నలు ఇచ్చేలా రూపకల్పన చేశారు.
మొత్తం మీద 60 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, 15 న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత వేస్తారు. న్యూమరికల్ వాల్యూ కింద ఇచ్చే 15 ప్రశ్నలకు మాత్రం నెగిటివ్ విధానం ఉండదు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ , బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ప్రవేశ పరీక్షల్లోనూ న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఇచ్చేలా ఎంహెచ్‌ఆర్‌డీ మార్పులు చేసింది. బీఆర్క్‌లో ప్రవేశాలకు 77 ప్రశ్నలతో 400 మార్కులకు, బీప్లానింగ్‌లో ప్రవేశాలకు 100 ప్రశ్నలతో 400 మార్కులకు పరీక్ష నిర్వహించనుంది.

పరీక్ష హాలుకు అరగంట ముందే రావాలి!

జేఈఈ మెయిన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ మైంది. ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో (jeemain. nta.nic.in) దరఖాస్తు చేసుకునేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 1వరకు ఫీజు చెల్లించ వచ్చు. దరఖాస్తుల్లో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు అక్టో బర్ 11 నుంచి 17 వరకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 6 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొదటి విడత పరీక్షలను 2020 జనవరి 6 నుంచి 11వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 2 విడతలుగా పరీక్షలు ఉంటాయి. మొదటి షిప్ట్ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్ పరీక్షకు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటలలోపే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

న్యూమరికల్ ప్రశ్నలే కీలకం

మొదటి 20 ప్రశ్నలతో ఇబ్బంది లేదు. న్యూమరికల్ వాల్యూ విధానంలో అడిగే ఐదు ప్రశ్నలతోనే ఇబ్బంది. అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం సులభమే. ఇందులో నెగిటివ్ మార్కులు లేకపోవడం కొంత ఊరట. విద్యార్థి పర్‌ఫెక్షన్‌ను పరీక్షిం చేలా ఈ ప్రశ్నలుంటాయి. ప్రతి సబ్జెక్టులో 5 చొప్పున 15 ప్రశ్న లకు 60 మార్కులు కాబట్టి అవి చాలా కీలకం. మెయిన్ పాత పేపర్లతోపాటు గత అడ్వాన్స్‌డ్ పరీక్షలో ఇచ్చిన న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు చూసుకుని ప్రిపేర్ అయితే సరిపోతుంది.

బాలికలకు సగం ఫీజే..

జనరల్, జనరల్- ఈడ బ్ల్యూఎస్, ఓబీసీ నాన్ క్రీమీలే య ర్ బాలురకు ఫీజును రూ.650గా బాలికలకు రూ.325గా నిర్ణయిం చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు రూ.325గా ఫీజు ఖరారు చేశారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు, యూపీఐ, పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.

తెలుగు రాష్ట్రాల‌లో పరీక్ష కేంద్రాలు

తెలంగాణలో: హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, వరంగల్.

ఆంధ్రప్రదేశ్‌లో: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం.

– కేశవ