వికసిత భారత నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.మౌలిక సదుపాయాలు, అందరికీ అవకాశాలు అనే నినాదంతో 2047 నాటికి భారత్ పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించబోతోందని చెప్పుకొచ్చారు నిర్మలమ్మ. ఆమె ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యధాతధంగా కొనసాగించారు. రూ.47.66 లక్షల కోట్లుగా ఉన్న ఈ బడ్జెట్ రాబోయే సంవత్సరాలకు ఒక విజన్ లాంటిదని నిర్మలా సీతారామన్ వివరించారు. 11.11 లక్షల కోట్ల మూలధన వ్యయ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్తూ గత దశాబ్దంలో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయమైన అభివృద్ధి సాధించిందని వెల్లడించారు.మొత్తంగా ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రసంగాన్ని గంటలోనే ముగించారు నిర్మలమ్మ.
ఇక బడ్జెట్ హైలెట్స్ చూస్తే…..సవరించిన ద్రవ్యలోటు 2023-24 (ఆర్థిక సంవత్సరం 2024) జీడీపీలో 5.8 శాతంగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 5.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. 2025-26 ఆర్థిక సంవ్సతరంలో ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతం కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
ఆదాయపు పన్ను శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2.4 రెట్లు పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2014 నుంచి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. 2024-25లో పన్ను రాబడులు రూ.26.02 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ కింద మరో 2 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.50 ఏళ్ల వడ్డీ లేని రుణంతో రూ.లక్ష కోట్ల కార్పస్ ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్పస్ తక్కువ వడ్డీ రేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ ను అందిస్తుందన్నారు.
యువత శక్తిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించే కార్యక్రమాలకు ఈ బడ్జెట్ ఊతంలా ఉంటుందన్నారు. రక్షణ అవసరాల కోసం డీప్ టెక్ టెక్నాలజీని బలోపేతం చేయడానికి, ఆత్మనిర్భరత్వాన్ని వేగవంతం చేయడానికి కొత్త పథకం ప్రారంభించనున్న నిర్మలమ్మ చెప్పారు.పీఎం స్వానిధి ద్వారా మరో 2.3 లక్షల మందికి కొత్త రుణాలు. గత పదేళ్లలో ఉన్నత విద్యలో 28 శాతం మహిళలు పెరిగినట్లు వెల్లడింకబారు. పెరిగిన మహిళల నమోదు. ట్రిపుల్ తలాక్ ను చట్టవిరుద్ధం చేయడం, లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద 70 శాతానికి పైగా ఇళ్లను మహిళలకు కేటాయించడం వల్ల వారి గౌరవం పెరిగిందని ఆర్థిక మంత్రి తెలిపారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆర్థిక మంత్రి రూ. 86 వేల కోట్లు కేటాయించారు. డెన్ ఆరోగ్య భద్రత కల్పించే ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ. 7,500 కోట్లు కేటాయించారు.ఈ పథకాన్ని ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహకాలు అందించేందుకు రూ. 6,200 కోట్లు కేటాయించారు.
అలాగే సెమీ కండక్టర్స్, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీ రంగానికి రూ. 6,903 కోట్లును ఆర్థిక మంత్రి కేటాయించారు. సోలార్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కోసం రూ. 8,500 కోట్లు కేటాయించగా.. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కోసం రూ. 600 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి కేటాయించారు. యూరియా సబ్సిడీకి రూ.164000 కోట్లు ప్రకటించారు.మత్స్య సంపద యోజన కింద 55 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.వచ్చే 50 ఏళ్లకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుందని, బ్లూ ఎకానమీ 2.0 కింద కొత్త పథకం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు.