భారతదేశంలో కొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నారు. కాబట్టి ఫిబ్రవరిలో ఈ ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ విడుదల కానుంది. ఈ బడ్జెట్‌లో ఆదాయ పన్ను విధానంలో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. అయినప్పటికీ పన్ను చెల్లింపుదారులు, విశ్లేషకులు తమ ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే ప్రకటనలను అంచనా వేస్తున్నారు. చరిత్రాత్మకంగా మధ్యంతర బడ్జెట్‌లు పెద్ద పెద్ద విధాన మార్పులను లేదా కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టవు. 2024 మధ్యంతర బడ్జెట్‌లో కూడా ఎలాంటి కీలక మార్పులు ఉండవని ఇటీవలి ఆర్థిక మంత్రి ప్రకటన స్పష్టం చేస్తోంది.
ముఖ్యమైన ప్రకటనలు ఫోకస్ కానప్పటికీ, కొన్ని ప్రాథమిక మార్పులు ఆశిస్తున్నామని RSM ఇండియా ఫౌండర్ సురేష్ సురానా పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు అడ్జస్ట్‌మెంట్‌లను చూసే అవకాశమున్న అంశాలను వివరించారు. చాలా మంది పన్ను చెల్లింపుదారులు పొందే అత్యంత పాపులర్ డిడక్షన్‌లలో 80C ఒకటి. ఇది ప్రావిడెంట్ ఫండ్, ELSS, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హౌసింగ్ లోన్ రీపేమెంట్, 5 సంవత్సరాల బ్యాంక్ డిపాజిట్లు వంటి ఇన్వెస్ట్‌మెంట్-లింక్డ్ డిడక్షన్‌లు అందిస్తుంది. ఈ సెక్షన్ కింద థ్రెషోల్డ్ లిమిట్ రూ.150,000, చివరిసారిగా బడ్జెట్ 2014లో సవరించారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి కారణంగా ఆర్థిక భద్రతను పరిగణనలోకి తీసుకుని, థ్రెషోల్డ్ లిమిట్‌ను రూ.200,000కి పెంచే అవకాశం ఉంది.