ఇలాంటి నాన్న ఎక్కడైనా ఉంటారా అండీ ! ఓ కూతురి జ్ఞాపకం

-

నేను రాసుకున్న ఈ స్టోరీకి సూపర్ లీడ్ లేదు. లీడ్ అంతకన్నా లేదు. నాన్న గురించి రాయడానికి నాలుగు లైన్ల లీడ్ సరిపోదు కదా! ఎందుకంటే లీడ్‌కు లిమిట్ ఉంటుంది. ఎమోషన్స్‌కి కాదు. నాన్న ఓ ఎమోషన్.

మా ఊర్లో ఐదొవ తరగతి వరకు పిల్లలందరూ పంతులు ట్యూషన్‌కు పోవాలి. ఆ ట్యూషన్‌కు పోవడం నాకు ఇష్టం లేదు. మూడవ తరగతి వరకు డైలీ వెళ్లేదాన్ని. అప్పుడు మా అక్కలందరూ తోడుండేవారు. వాళ్లు ఐదొవ తరగతి పూర్తి కాగానే హైస్కూల్‌కు మారారు. అప్పుడు ట్యూషన్ కూడా మారాలి కదా. నేను అప్పుడు నాలుగో తరగతి చదువుతున్న. నేను కూడా అక్క వాళ్లతో ఆ ట్యూషన్‌కు పోతానని ఏడ్చేదాన్ని. కానీ ఆ ట్యూషన్‌కు ఐదొవ తరగతి నుంచి పది వరకు వాళ్లకే ప్రవేశం ఉంది. ఇంట్లో వాళ్ల పోడుకు పంతులు ట్యూషన్‌కు పోక తప్పలేదు. తప్పని సరిగా పోయేదాన్ని. ఒక్కోసారి కడుపునొప్పి, తలనొప్కి అంటూ రాని యాక్టింగ్ కూడా చేసేదాన్ని. ఇలా ఎన్నిసార్లని తప్పించుకుంటాం. ఎలాగోలా ట్యూషన్‌కు పోయేదాన్ని. ఒకరోజు గుణకారం, బాగాహారం (మల్టిప్లికేషన్, డివిజన్) క్లాస్ నడుస్తున్నది ట్యూషన్‌లో. సార్ ఎంత చెప్పినా నాకు అర్థం కాలేదు. ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా అంటూ బెత్తం విరిగేవరకు కొట్టాడు మా సారు. ఎంతలా అంటే చర్మం కందిపోయేంతగా అన్నమాట.

కొడితే అర్థమవుతుందా అనుకునేదాన్ని. ఏడ్చి ఏడ్చి ఆరోజు ఇంటికి వెళ్లా. మా నాన్నకు చెప్పి ఆ సార్‌ను తిట్టిపిద్దాం అనుకున్నా. ఎంతైనా నాన్న నా మాటే వింటాడు అనుకున్న. ఉన్నవి లేనివి అన్నీ కల్పించుకొని సార్ మీద సాడీలు చెప్పా. మా నాన్నకు పట్టరాని కోపం వచ్చింది. పిల్లల్ని ఈ రకంగా కొడతారా! పదా ఆయన సంగతి చూస్తా అంటూ తర్వాతి రోజు నాతో పాటు మా నాన్న కూడా ట్యూషన్‌కు వచ్చాడు. అయితే ముందు నువ్వు వెళ్లు, నేను కాసేపు అయ్యాక వస్తానన్నాడు. సరే అని నేను ట్యూషన్ లోపల అడుగు పెట్టా. టైం అవుతుంది ఇంకా మా నాన్న రాలేదేంటని గుమ్మం వైపు చూస్తూనే ఉన్నా. ఈ రోజు మా నాన్న వస్తాడు. సార్‌ని బాగా తిడుతాడని ఫ్రెండ్స్‌తో ఆనందంగా చెప్పా. అంతలోనే మా నాన్న రానే వచ్చాడు. ఏంటి సార్ మా అమ్మాయిని కొట్టారంటా అని గట్టిగా అడిగాడు. సార్ ఈ దెబ్బతో అయిపోయాడు అని మురిసిపోయేలోపు మరో డైలాగ్ వినిపించింది. ఇంకోసారి ఇలాంటి విషయాలు ఇంట్లో చెప్పకుండా మరో నాలుగు తగిలించండని సార్‌కు హామీ ఇచ్చి వెళ్లిపోయాడు మా నాన్న. ఇలాంటి నాన్న ఎక్కడైనా ఉంటారా అండీ.. మీరే చెప్పండి..

బాగా వర్షం పడుతుంది..

ఐదొవ తరగతి పూర్తి కాగానే నాకు నచ్చిన ట్యూషన్ మాస్టర్ తిరుపాల్‌రెడ్డి సార్ దగ్గరకు వచ్చేశాను. ఆయన చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకొని ఆయన నోటితోనే శభాష్ అనిపించుకునేదాన్ని. ఇలా ఎందుకు పనికిరావు అన్న పంతులు మాటలను పూర్తిగా మార్చేశాను. క్లాస్‌లో టాపర్‌లా నిలిచాను. హైస్కూల్‌లో ఉండే ఉపాధ్యాయులందరూ నన్ను బాగా చూసుకునేవారు. ఇలా ఉన్న రోజుల్లో ఒకసారి రాత్రి బాగా వర్షం పడుతున్నది. అప్పుడు నేను ట్యూషన్‌లో ఉన్నా. తొమ్మిదో తరగతి అనుకుంటా. అప్పుడు మా అక్కలందరూ ఇంటర్మీడియట్ చదువు కోసం హాస్టల్‌లో ఉండేవారు. ట్యూషన్ 8 గంటలకే అయిపోతుంది. వర్షం పడుతుండే సరికి మా ఫ్రెండ్స్ నాన్నలు వచ్చి వారిని ఇంటికి తీసుకొని పోతున్నారు.

మా నాన్న కూడా వస్తాడేమోనని చూస్తున్నా. వర్షం తగ్గాల్సిందే కాని మా నాన్న వచ్చేలా లేడని అర్థమైంది. ఇంటికి ట్యూషన్‌కు దూరం పెద్దగా ఏం లేదు. అయినా నాన్న వచ్చి తీసుకుపోతే అదొక ఆనందం కదా అనుకునేదాన్ని. తిరుపాల్‌రెడ్డి సార్ మాకు బంధువు కూడా అవుతాడు. పరీక్షల సమయంలో అక్కడే ఉండి చదువుకునే వాళ్లం కూడా. ఎంత బంధువయినా.. సార్ సారే కదా అనుకునేదాన్ని నేను. మొత్తానికి వర్షం తగ్గింది. 8 కాస్త 8.30 గంటల సమయం అయింది. ఇంటికి వెళ్లాక మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు. కోపం వచ్చింది. వర్షం పడుతుండేసరికి అందరూ అమ్మానాన్నలు గొడుకు తీసుకొచ్చి వారిని ఇంటిని తీసుకెళ్లారు. నువ్వు మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చోనున్నావా అని అడిగేశా. అప్పుడు మా నాన్న వర్షం పడుతుందన్న సంగతి తెలుసు కదా. అది ఆగే వరకు ట్యూషన్‌లోనే ఉండి చదువుకుంటే నిన్ను సార్ ఏమైనా కొడతాడా? నీ కోసం ఒకరు పనిమానుకొని రావాలా? అని అన్నాడు. ఇప్పుడు చెప్పండి మా నాన్నకు అసలు నేనంటే ఇష్టమేనా?

ఇంకేం కావాలి..

హైస్కూల్ నుంచి ఇంటర్మీడియట్‌కు వెళ్లాను. హాస్టల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్నా. అందుకు మా నాన్నని ఒప్పించి హాస్టల్ చేరాను. నెలకు రెండు మూడుసార్లు ఇంటికి వెళ్తుండేదాన్ని. ఇంటి నుంచి హాస్టల్‌కు వచ్చేటప్పుడు ఖర్చులకు డబ్బులిచ్చేవాడు. మొదట్లో ఖర్చులుండవు కాబట్టి సరిపోయేవి. రానురాను మా నాన్న ఇచ్చే డబ్బులు సరిపోయేవి కావు. ఆ సమయంలో అక్క డిగ్రీ, అన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చుదవుతున్నాడు. అందరికీ డబ్బులు ఇవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉండేది మా నాన్నకి. అయినా అవన్నీ నాకెందుకు. నాకు ఖర్చులకు నువ్విచ్చే డబ్బులు సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ ఇవ్వు అని గట్టిగానే అడిగా. గట్టిగా అడగ్గానే అడిగింది ఇచ్చేస్తే నాన్న ఎందుకు అవుతాడు. ఆకలేసినప్పుడల్లా కడుపునిండా తిండి పెడతారు. అవసరమైనంతా చదువు చెబుతారు నీకు అవసరమైన ఖర్చులకు ఈ డబ్బులు సరిపోతాయి అదనంగా డబ్బులు ఎందుకు. దానికి సమాదానం చెప్పు అడిగినంత ఇస్తాను అన్నాడు. ఇంకేం చెబుతాం. కామ్‌గా బస్ ఎక్కి హాస్టల్‌కు వెళ్లిపోయా. ఇదండి మా నాన్నతో నాకున్న అనుబంధం..

ఇది కూడా ఒక రకమైన ప్రేమేనండోయ్..

ఇంటర్మీడియట్‌కు నుంచి బీటెక్ చేరా. మొదటి రెండు సంవత్సరాలు కొత్తగానే ఉన్నాయి. బీటెక్ మూడో సంవత్సరానికి వచ్చేసరికి మెచ్యూరిటీ లెవల్ పెరుగుతుంది. నాకైతే మరీ ఎక్కువే ఉండేది. చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటుండేదాన్ని మా నాన్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు. మేమంటే ఇష్టం లేదా? నేను ఒక్కదాన్నే ఇష్టం లేదా అనుకునేదానికి లేదు. ముగ్గురినీ సమానంగానే చూసేవాడు. ఇంట్లో చిన్నదాన్ని కావడం వల్ల కొంచెం గడుచుగానే మాట్లాడేదాన్ని. మా నాన్నని లెక్కచేయని దాన్ని కూడా నేనే కావచ్చు. ఒకరోజు మా నాన్న దగ్గరకి వెళ్లి నాన్నా.. మేమంటే ఎందుకు నీకు ఇష్టం ఉండదు అని అడిగా. ఇష్టం లేదని ఎవరు అన్నారు అని అన్నాడు. మరి చిన్నప్పుడు సార్ కొట్టాడంటే ఆయనకే సపోర్ట్ చేశావు. వర్షం పడుతుంటే నన్ను ఇంటికి తీసుకుపోవడానికి రాలేదు. అదనపు ఖర్చులకు డబ్బులు అడిగితే ఇవ్వవు కదా నాన్న. దానికి బదులుగా ఆ రోజు నిన్ను కొట్టాడు కదా అని నేను సార్‌ని మా అమ్మాయిని ఎందుకు కొట్టారు అని అడిగితే నీకు ఆయన మళ్లీ మనస్ఫూర్తిగా చదువు చెప్పగలడా? అని అన్నాడు.

మరి వర్షం పడినప్పుడు.. అరగంట సమయం ఎక్కువైందని నేను నీ కోసం వస్తే వర్షం వచ్చిన ప్రతిసారీ నువ్వు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటావు. ఇలా ఒకరి మీద ఆధారపడకూడదని అలా చేశాను. వీటికి బాగానే చెప్పావు. డబ్బులు సంగతేంటి.. మీకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ నేను అందిస్తున్నాను. అవి కాకుండా మీకు అదనపు ఖర్చులున్నాయి అంటే అవి అంత మంచిది కాదు. పొదుపు లేకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతే జీవితంలో ఏమి మిగలదు ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి అలమరుచుకోవాలని ఇలా చేశాను అని బదులిచ్చాడు. తొందరపడి మీ నాన్న మీద ద్వేషం పెంచుకోకండి. వారు మీ విషయంలో ప్రవర్తించే ప్రతితీరు మీకు మంచి చేయాలనే ఉంటుంది. నాకు మెచ్చూరిటీ లెవల్ ఎక్కువ కాబట్టి నేను మా నాన్నని అర్థం చేసుకున్నాను. మరీ మీరు… HAPPY FATHER’S DAY

– వ‌న‌జ‌

Read more RELATED
Recommended to you

Exit mobile version