Independence Day: 77వ స్వతంత్ర దినోత్సవాలకు కేంద్రం, రాష్ట్రాలతో పాటు.. ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హర్ ఘర్ తిరంగా ప్రచారం 2.0 లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసులలో భారత జాతీయ జెండాను విక్రయిస్తున్నారు. పౌరులందరూ తమ ఇళ్లల్లో జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఒక ప్రచారాన్ని ప్రారంభించింది.
తపాలా శాఖ తన వెబ్ పోర్టల్ ద్వారా జాతీయ జెండాను ఆన్ లైన్ లో విక్రయించనున్నట్లు ప్రకటించింది. కేవలం 25 రూపాయలకే జాతీయ జెండాను అందిస్తున్నారు. గ్రామాలకు సమీపంలో ఉండే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లకు వెళ్లి జాతీయ జెండాలను కొనుగోలు చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు 1.6 లక్షల పోస్ట్ ఆఫీసుల ద్వారా జాతీయ జెండాను విక్రయిస్తోంది.
పౌరులు జాతీయ జెండాను డిపార్ట్మెంట్ ఇ – పోస్ట్ ఆఫీస్ సౌకర్యం ద్వారా కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి ఇంటి త్రివర్ణ ప్రచారం 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు 2023 వరకు కొనసాగుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని స్వతంత్ర దినోత్సవ పండుగను గ్రామ గ్రామాల్లో ఘనంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు.