పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. నేడు పార్లమెంట్‌లో కీలక బిల్లు పాసైంది. దేశ పౌరుల డేటా దుర్వినియోగానికి పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలకు వీలు కల్పించే ఈ బిల్లుకు లోక్ సభలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించింది. ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు-2023 ద్వారా దేశ పౌరుల డిజిటల్ హక్కులు బలోపేతం అవుతాయని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం చేసే కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు వీలవుతుందన్నది ప్రభుత్వ వాదన.
ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం గతవారమే లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీనిపై నేడు చర్చ చేపట్టారు. అయితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. ఓవైపు విపక్షాల నిరసనలు కొనసాగుతుండగానే మూజువాణి పద్దతిలో ఓటింగ్ నిర్వహించి బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకుంది.
గత గురువారం నాడు ఈ బిల్లును కేంద్ర కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. అయితే, వ్యక్తిగత సమాచార గోప్యత ప్రాథమిక హక్కుకు ఈ బిల్లు తూట్లు పొడుస్తుందని విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ బిల్లును మొదట స్టాండింగ్ కమిటీ ముందుకు పంపాలని డిమాండ్ చేశాయి. గతేడాది కూడా ఇలాంటిదే బిల్లు తీసుకువచ్చే ప్రయత్నం చేసి, ప్రభుత్వం ఉపసంహరించుకుందని విపక్షాలు గుర్తు చేశాయి. కానీ, ఈసారి మాత్రం కేంద్రం పట్టుబట్టి మరీ బిల్లును ఆమోదింపజేసుకుంది.