నేడు తెలంగాణలో సామూహిక ‘జనగణమన’

-

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30కి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన జరగనుంది. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ (జీపీవో) సర్కిల్‌ వద్ద నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఇందులో భాగస్వాములవనున్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలు తదితర ప్రదేశాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా సరిగ్గా 11.30కి ‘జనగణమన’ జాతీయ గీతాన్ని ఆలపించాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే పిలుపునిచ్చారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించింది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ అబిడ్స్‌లోని జీపీవో సర్కిల్‌, నెక్లెస్‌ రోడ్డు వాటర్‌ఫ్రంట్‌ కూడలి తదితర ప్రాంతాలను సోమవారం సందర్శించి ఏర్పాట్లపై పోలీసు అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. వేదికల వద్ద స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలు, గీతాలాపనకు అనువుగా మైకులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news