శిలగా మారిన ఆ సోదరుడికి రాఖీ కట్టిన సోదరి.. ఈ స్టోరీ చదివితే కన్నీరు ఆగేనా..?

చిన్నిచిన్ని తగాదాలు.. అప్పుడప్పుడు అలకలు.. మధ్యలోనే అంతులేని అనురాగం.. తోబుట్టువుల మధ్య ప్రేమకు ప్రతిరూపం. రక్షాబంధన్ రోజున తమ బంధానికి గుర్తుగా సోదరి రాఖీ కడుతుంది. మీ కష్టసుఖాల్లో అండగా ఉంటామని అన్నదమ్ములు భరోసానిస్తారు. మరి దేశం కోసం సరిహద్దుల్లో కాపుకాస్తూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అన్నలకు చెల్లెల్లు రాఖీ కట్టాలంటే..దానికి తపాలా ఉంది. ఇక్కడి నుంచి తమ అన్నదమ్ములకు రాఖీ పంపిస్తూ.. వారు తమనే కాకుండా దేశంలోని తోబుట్టవులందరికి తోడుగా నిలుస్తూ.. రక్షిస్తున్నందుకు వారి అక్కాచెళ్లెల్లు వారికి రాఖీ పంపిస్తుంటారు. మరి దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన సోదరుల తోబుట్టువులు ఏం చేస్తారు. అలా సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన తన అన్నకు ఓ చెల్లి రాఖీ కట్టింది. అదెలా సాధ్యమంటారా. ఈ ఫొటో చూడండి. అసలు విషయం మీకే తెలుస్తుంది.

శత్రువుల నుంచి దేశాన్ని కాచే సైనిక సోదరుడికి రాఖీ కట్టింది ఓ మహిళ. కానీ.. అతడు మాత్రం ఆమెను చూసి నవ్వలేదు. ఆత్మీయంగా దగ్గరికి తీసుకోలేదు. కనీసం ఓ బహుమతి కూడా ఇవ్వలేదు. కళ్లెదుటే ఉన్న సోదరుడిలో చలనం లేకపోతే.. ఆ సోదరి మనసు తట్టుకోగలదా..?కన్నీరుపెట్టకుండా ఉండగలదా..? ఉలుకూపలుకూ లేక శిలగా మారిన ఆ సోదరుడి వెనుక కథ తెలిస్తే హృదయం ద్రవించకమానదు..! వేదాంత్ బిర్లా అనే వ్యక్తి షేర్ చేసిన ఈ దృశ్యం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఆ చిత్రంలో సైనికుడి దుస్తుల్లో తుపాకీ చేతబట్టి ఉన్న సోదరుడి విగ్రహానికి ఒక మహిళ రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టింది. ఆ వ్యక్తి పేరు షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా. దేశసేవలో ప్రాణాలు అర్పించిన కద్వాస్రా వీరత్వానికి గుర్తుగా రాజస్థాన్‌లో విగ్రహం ఏర్పాటు చేశారు. దానికే ఆ మహిళ రాఖీ కట్టి, కన్నీరు తెప్పించింది.

‘ఇలాంటి సన్నివేశాలే భారత్‌ను అసాధారణంగా మారుస్తాయి. సోదరుడిని కోల్పోయిన బాధ, దేశం కోసం ప్రాణత్యాగం చేశాడనే గర్వం ఆమెను ఒకేసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేనున్నాంటూ భరోసా ఇచ్చే ఆ సోదరుడి చేతికి రాఖీ కట్టలేక ఆమె మనసు అలజడికి గురైంది. తనను తాను నియంత్రించుకుని విగ్రహ రూపంలో నిలిచిన అతడి చేతికే రాఖీ కట్టింది. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌కు చెందిన షాహీద్ గణపత్ రామ్ కద్వాస్రా జాట్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించారు. 24-09-2017న జమ్మూకశ్మీర్‌లో విధి నిర్వహణలో అమరుడయ్యారు’ అంటూ వేదాంత్‌ తన పోస్టులో రాసుకొచ్చారు. ఇది చదివిన నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి దేశసేవ చేస్తోన్న సైనికులకు సలాం కొట్టారు.