తెలంగాణ దశాబ్ది వేడుకలను ధూంధాంగా సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మొదటగా జాతీయ జెండా ఆవిష్కరించి.. పోలీసుల వందనం స్వీకరించారు. అనంతరం బీఆర్ఎస్ సర్కార్ ప్రగతిప్రస్థానాన్ని సవివరంగా పథకాలను గణంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ఆవిర్భావ తొలి వేడుక సాక్షిగా పరేడ్‌గ్రౌండ్‌లో ఇచ్చిన హామీ మేరకు ఉక్కుసంకల్పంతో 9ఏళ్ల అనతికాలంలో తెలంగాణ స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు.
ప్రజల ఆర్తిని ప్రతిబింబించేలా మేనిఫెస్టోను రూపోందించుకుని అమలు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. సంపదను పెంచుదాం… ప్రజలకు పంచుదామని అనే నినాదంతో సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తెచ్చామని ఉద్ఘాటించారు. కరోనా, నోట్ల రద్దు వంటి అవరోధాలను తట్టుకుని వృద్ధిరేటులో అగ్రస్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర పథకాల పట్ల దేశమంతటా ఆదరణ కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
“సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణ యుగాన్ని ఆవిష్కరించింది. తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధితో పెద్ద రాష్ట్రాలను దాటాం. తలసరి విద్యుత్ వినియోగంలో మనదే ప్రథమ స్థానం. ఎత్తిపోతల పథకాలతో బీడుభూములన్నీ సస్యశ్యామలమయ్యాయి. తాగునీటి కష్టాలకు మిషన్ భగీరథ చరమగీతం పాడింది. మన పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు వస్తున్నాయి. మన నగరాలు.. ప్రపంచస్థాయి గుర్తింపు పొందుతున్నాయి” అని కేసీఆర్ అన్నారు.