తొమ్మిదేళ్లుగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం ఇవాళ్టితో పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎంతోమంది పోరాటయోధుల ప్రాణ త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. అలాంటి త్యాగధనులందరికీ నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పవన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలని.. రైతులు, కార్మికులతో పాటు ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందమయమైన జీవితం సాగించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు, వేలాది మంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, అభివృద్ధి పథంలో దూసుకెళ్ళాలని జనసేనపార్టీ తరపున ఆకాంక్షిస్తూ, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాము.… pic.twitter.com/EaZGuDTCTT
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2023