తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో శాఖ ఆధ్వర్యంలో అట్టహాసంగా ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ గొర్రెల పంపిణీ రెండో విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నల్గొండ జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లోనూ గొర్రెల పంపిణీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా ప్రారంభం కానుంది. రెండో విడతలో యూనిట్ ధర లక్షా 25 వేల నుంచి 50 వేల రూపాయలు పెంచి.. లక్షా 75 వేల రూపాయలుగా ఖరారు చేసింది. ప్రభుత్వ వాటా లక్షా 31 వేల 250 రూపాయలు కాగా… లబ్ధిదారుడి వాటా 43,750 రూపాయలు. రెండో విడతలో 3 లక్షల 37 వేల 816 మంది లబ్దిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 6 వేల 85 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.