ఒక మనిషిని ఆమూలాగ్రం అభిమానించిన వ్యక్తి ఆ మనిషిలో చిన్న మార్పుని జీర్ణించుకోలేక దూరమవుతున్నారంటే.. ఎంత బలంగా ఉన్నాయో కదా మన అభిమానాలు! వీటికోసమా మనం పరితపించవలసింది? వీటి వలలో కూరుకుపోయి ఎన్నాళ్లని చిక్కుముళ్లని విడదీసుకుంటూ, భావోద్వేగాల్లో బందీలుగా మిగిలిపోవడం?
పోతే పోనిద్దాం.. ఎవరెలా ముద్రలు గుద్దితే మనకేమి.. మన గమ్యాన్ని, లక్ష్యాన్ని మరిచి మనుషుల చిత్రమైన చిత్తాలను ఎంత కాలమని సంతృప్తి పరచగలం? అభిమానం మొదట్లో ఉత్సాహపరుస్తుంది. అదే అభిమానం మనం దానికి దాసోహమైతే తనకోసం వెంపర్లాడేలా చేస్తుంది. ఆ దుస్థితిని దూరంగా ఆగిపోవలసిన విజ్ఞత మనదే.
ఈ చిత్తపు చిత్రాలు చూస్తుంటే అనిపిస్తుంటుంది. ఈ ప్రపంచంలో మనం ఏ మానసిక ఆలంబనకూ బందీ అవకుండా మిగిలిపోవడానికి మించిన సుఖం లేదు. అభిమానమైనా, ద్వేషమైనా, మరేదైనా నిర్లిప్తంగా సాగిపోనివ్వడమే. మన మనఃసాక్షి చాలు మనల్ని సరిచెయ్యడానికి!