ఎంపీ సంతోష్‌ ఉదారత

తెలంగాణ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ స్వతహాగా సున్నిత మసస్కుడు. సాధారణంగా సమాజానికి కనిపించని అవసరార్థులను కనిపెట్టి సహాయం చేయడంలో ఆయన ముందుంటారు.

‘సర్వ్‌ నీడీ’ అనే ఒక స్వచ్చంద సంస్థ ఆనాథలను చేరదీస్తూ, వారికి అన్ని రకాల సదుపాయాలను అందిస్తుంటుంది. హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌, చెన్నై. బెంగుళూరులలో 7 బ్రాంచీలు కల ఈ సంస్థ ఎంతో ఉదారతతో, మానవత్వంతో అనాథలకు సహాయం చేస్తుంటుంది.

హైదరాబాద్‌లోని ఆ సంస్థలోని పిల్లలు ఆహారం లేక గత కొన్ని రోజులుగా సతమతమవుతున్నారన్న సమాచరం టీవీల ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాజ్యసభ ఎంపీ సంతోష్‌ వెంటనే ఆ సదనానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపించారు. అంతే కాకుండా రానున్న మూడు నెలలకు కూడా తానే సరుకులు పంపిస్తానని నిర్వాహకులకు మాటిచ్చి, ఇతర ఖర్చుల కోసం 25వేల రూపాయలకు చెక్కును కూడా అందించారు.

సర్వ్‌ నీడీ సదనంలో ఉన్న పిల్లల కోసం శాశ్వతంగా ఏదైనా పరిష్కారం చూపాలని కూడా సంతోష్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా సంతోష్‌ చాలాసార్లు ఇలా సహాయాలు చేసారు. సినీ కార్మికుల కోసం నటుడు కాదంబరి కిరణ్‌ ఏర్పాటు చేసిన సహాయ సంస్థకు ధన, వస్తు రూపేణా ఎంతో సహకారం అందించారు. ఇంకా తెలియని గుప్తదానాలు మరెన్నో.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో, సోషల్‌ మీడియా బాధ్యతారహితంగా విచ్చలవిడిగా అబద్ధపు ప్రచారాలతో నిండిపోతుండగా, ఎంతో బాధ్యతాయుతంగా, అర్థవంతంగా, ఆలోచింపజేసే విధంగా పోస్టులు పెడుతుంటారు సంతోష్‌కుమార్‌. చాలా తక్కువగా మాట్లాడుతూ, వయసుకు మించిన పరిణితిని సాధించిన సంతోష్‌ ‘‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’’ ఎంతో కీర్తిని పొంది, దేశవ్యాప్తంగా కోటానుకోట్ల మొక్కలను నాటించింది. ఇదొక్కటి చాలు, సమాజం పట్ల ఆయన అంకితభావం, బాధ్యత తెలియజెప్పడానికి. ఎంతో భవిష్యత్తున్న సంతోష్‌కు, భావిభారతావనికి మరింత సేవ చేసే అవకాశం కలగాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా.