మీకు అహం ఎక్కువగా ఉందని తెలిపే లక్షణాలు

ఈ ప్రపంచం ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఇక్కడకు చుట్టపుచూపుగా వచ్చిన మనుషులు మళ్ళీ మరీ ప్రపంచానికి వెళ్ళాల్సిందే. కానీ ఈ ఆలోచన అందరికీ ఉండదు. సాటి మనిషి కూడా సమానమే అన్న భావం తగ్గిపోతుంది. అహం ఎక్కువవుతుంది. కానీ ఈ అహం మంచిది కాదు. మీ లోపలే ఉండి మిమ్మల్ని తినేస్తూ ఉంటుంది. ఆ విషయం మీకు తెలియదు. అందుకే అహం నుండి వీలైనంత తొందరగా బయటపడాలి. మీకు అహం పెరుగుతుందని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

వస్తువులకు విలువ

మనుషులకి విలువ ఇవ్వడం కంటే వస్తువులకు ఎక్కువ విలువ ఇస్తారు. మనుషుల మీద నమ్మకం తగ్గిపోయి, ఖరీదైన వస్తువులను తమ పాకెట్లో ఉంచుకుకే లక్షణాన్ని కలిగి ఉంటారు.

పుకార్లు

పుకార్లు వినడానికి, పుకార్లు ప్రచారం చేయడానికి వీరికిశ్రద్ధ ఎక్కువ. అవతలి వారు అది, ఇది అని చెప్పుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఈ గాసిప్స్ వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే గంటల తరబడి వీటికి సమయం కేటాయిస్తారు.

పొగడ్తలు

మీ చుట్టూరా మిమ్మల్ని పొగిడే వారున్నప్పుడు మీకు అహం ఎక్కువయ్యే అవకాశం చాలా ఉంటుంది. పొగడ్తలు మీలోని నమ్మకాన్ని మరింత పెంచుతాయి. అది అహంభావానికి దారి తీసే అవకాశం లేకపోలేదు.

అంతరాయం

ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు పూర్తి కాకుండానే మీ గురించి మాట కలిపే అలవాటు పెరుగుతుందంటే మీలో అహం పెరుగుతుందని అర్థం.

పోటీ

ఏదైనా ఒక పనిలో పోటీని ఎదుర్కోలేక చతికిల పడితే, దాన్ని తట్టుకోలేక ఎమోషనల్ అయిపోవడం కూడా మీలోని అహానికి సంకేతం.

సోషల్ లైఫ్

పార్టీల్లో ఎక్కువగా కలవకపోవడం, ఎక్కువ మందితో మాట్లాడకపోవడం వంటి లక్షణాలు మీలో ఉన్నట్లయితే అహం ఉన్నట్టే లెక్క.

క్రెడిట్

మీరు విజయం సాధించడానికి అవతలి వారి పనులని మీ పనులని చెప్పించుకోవడంలో ఏమాత్రం సంకోచించకపోవడం.

నియంత్రణ

ప్రతీ ఒక్కరూ మీ మాట వినాలని, మీరు చెప్పిందే నెగ్గాలని అనుకుంటూ ఉంటారు. అవతలి వారిని డామినేట్ చేయడాన్ని మీరు ఇష్టపడతారు.