పరాశరన్ గాడ్స్ అడ్వకేట్‌గా పిలుస్తారు ఈయన్ని. అయోధ్య ఉద్యమంలో భాగంగా అవిశ్రాంత న్యాయ పోరాటం జరిపిన హీరో కె.పరాశరన్. ఇది పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈయన న్యాయవాదిగా 1958 నుంచి సుప్రీం కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. రెండుసార్లు భారత అటార్నీ జనరల్గా చేశారు. న్యాయ శాస్త్ర స్రష్ట. హిందూ పవిత్ర గ్రంథాలను ఔపోసన పట్టిన మహా పండితుడు. తనకున్న ఆ అపార పరిజ్ఞానాన్ని వాదనల్లో అద్భుతంగా ప్రతిబింబింప చేశారు. ‘నేను మరణించే లోగా ఈ కేసును పూర్తి చేయాలి. అదే నా అంతిమ కోరిక’ అని ఆయన సుప్రీంకోర్టులోనే ఒక సందర్బంలో పేర్కొన్నారు.
92 సంవత్సరాల వయసులోనూ ఆయన పట్టు వదలకుండా, అలసట అనేదే లేకుండా శ్రీరాముడి కోసం.. ఆ రామ్లల్లా విరాజ్మాన్ కోసం ఇన్నేళ్లుగా వాదించారు. అందువల్లే ఆయన సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన రోజున.. తీర్పు ముగిసే వరకు ఓపిగ్గా కోర్టు హాలులోని మొదటి వరుసలో కూర్చున్నారు. తీర్పును ఏకాగ్రతతో విన్నారు. తుది తీర్పు వెలువడగానే న్యాయవాదు లంతా ఆయనను చుట్టుముట్టారు. అభినందనల్లో ముంచెత్తారు. కోర్టు హాలు నుంచి బయటకు రాగానే ఆయనతో పలువురు సెల్ఫీలు తీసుకునేం దుకు పోటీ పడ్డారు. భారత ప్రభుత్వం ఆయనను 2003లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2019, అక్టోబరు 16న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘మోస్ట్ ఎమినెంట్ సీనియర్ సిటిజెన్’ అవార్డునూ పరాశరన్ అందుకున్నారు.