కరోనాను కట్టడి చేసేందుకు ప్రధాని మోదీ దేశంలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన విషయం విదితమే. అయితే కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి పలు చోట్ల లాక్‌డౌన్ ఆంక్షలను సడలించారు. ఇక కేంద్ర హోం శాఖ మొదట్లో ఏప్రిల్ 20 నుంచి ఈ-కామర్స్ సంస్థలు నాన్ ఎసెన్షియల్ వస్తువులను కూడా విక్రయించవచ్చని చెప్పి.. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయంపై ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఏప్రిల్ 20 నుంచి దేశంలో పలు చోట్ల లాక్‌డౌన్ ఆంక్షలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో.. కేంద్రం మొదట ఈ-కామర్స్ సంస్థలకు తిరిగి యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో కేవలం అత్యవసర వస్తువులను మాత్రమే ఈ-కామర్స్ సంస్థలు అమ్మాలని కేంద్రం చెప్పింది. ఇక ఈ విషయంపై అమెజాన్ సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులకు, తయారీదారులకు ఇబ్బందులు కలుగుతాయని అమెజాన్ పేర్కొంది.
లాక్‌డౌన్ వల్ల దేశంలో ఉన్న ఎంతో మంది కస్టమర్లు తమకు అవసరం ఉన్న వస్తువులను పొందలేకపోతున్నారని.. అలాగే ఎంతో మంది చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని.. అమెజాన్ తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించడానికి ఈ-కామర్స్ సంస్థలకు నాన్ ఎసెన్షియల్ వస్తువులను అమ్మేందుకు కూడా అనుమతి ఇచ్చి ఉండాల్సిందని అమెజాన్ అభిప్రాయ పడింది. అయితే మే 3వ తేదీన లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ఆ తరువాత ఈ-కామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలను యథావిధిగా ప్రారంభిస్తాయో, లేదో చూడాలి..!