ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది సైంటిస్టులు, ప్రైవేటు ల్యాబ్‌లు, పరిశోధన సంస్థలు.. కరోనా వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడ్డాయి. అయితే ఆ ప్రయోగాలు విజయవంతమవుతాయా..? కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా..? అన్న వివరాలను పక్కన పెడితే.. ప్రస్తుతం అమెరికా మాత్రం కరోనా చికిత్సకు ఓ నూతన విధానాన్ని ట్రై చేస్తోంది. అదేమిటంటే…
కరోనా వచ్చి నయమైన పేషెంట్లలో ఆ వైరస్‌ను నాశనం చేసే యాంటీ బాడీలు ఉంటాయి కదా.. అవి వారి రక్తంలోని ప్లాస్మాలో ఉంటాయి. అందుకని ఆ ప్లాస్మాను తీసుకుని కరోనా రోగులకు ఇంజెక్ట్ చేస్తే.. కరోనా వైరస్ నాశనమవుతుంది కదా.. అని వైద్యులు ఆలోచించారు. 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఇదే తరహా ప్రయోగాన్ని చేపట్టి ఎంతో మందిని రక్షించారు. అందుకనే మళ్లీ ఇప్పుడు కరోనా చికిత్సకు అమెరికా వైద్యులు ఇదే తరహా విధానాన్ని అనుసరించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ వైద్యులు కరోనా వచ్చి నయమైన వారి రక్తం నుంచి ప్లాస్మాను తీసుకునే పనిలో పడ్డారు. ఇక ఆ ప్లాస్మాను కరోనా రోగులకు ఎక్కించడమే తరువాయి. ఆ ఒక్క స్టెప్ పూర్తి చేస్తే కరోనాను ఎదుర్కోవడంలో వైద్యులు మేజర్ బ్రేక్ త్రూను సాధించినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రయోగాన్ని అక్కడి వైద్యులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చూడాలి.
ఇక ఈ చికిత్సా విధానాన్ని ‘బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ థెరపీ’గా వ్యవహరిస్తున్నారు. కాగా అమెరికాలో ఇప్పటి వరకు 1,24,697 కరోనా కేసులు నమోదు కాగా.. 3231 మంది రికవరీ అయ్యారు. మరో 2,227 మంది చనిపోయారు. ఈ క్రమంలో అమెరికాలో పరిస్థితి ప్రస్తుతం అత్యంత ఆందోళనకరంగా మారింది. మరి ముందు ముందు అక్కడ ఏమవుతుందో చూడాలి..!