కరోనా.. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ప్రమాదకర వైరస్. మనుషుల ప్రాణాలను వారాల వ్యవధిలోనే కబళిస్తున్న పెను భూతం. ప్రస్తుతం దీనికి మందు లేదు. ఉన్నదల్లా ఇంట్లో కూర్చోవడమే. సంయమనం.. సహనం.. ఓర్పు.. ఈ మూడు లక్షణాలను మించి చేయగలిగింది ఏమీలేదు. ఎంత ఓర్పుగా ఇంట్లో ఉంటే అంత నేర్పుగా వైరస్‌ను తిప్పికొట్టొచ్చని నిపుణులు, వైద్యులు , శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఫలితంగా ప్రపంచం మొత్తం తాళం వేసుకుని ఇంటికే పరిమితమైంది. ఆఫీసులు మూతబడ్డాయి. పరిశ్రమలకు తాళం వేశారు. పనులు నిలిచిపోయాయి. ఉపాధి ఆగిపోయింది. దీంతో ప్రజల ఆర్థిక వ్యవస్థ రాబో యే రోజుల్లో మరింత దారుణంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉందనేది వాస్తవం. ఒక్క మీడియా, వైద్య రంగం తప్ప ప్రైవేటులో ఏ ఒక్కటీ పనిచేయడం లేదు.
ఫలితంగా దేశవ్యాప్తంగా కూడా పేదలు, రోజువారి కూలీలు రోడ్డున పడ్డారు. ఏ రోజుకు ఆరోజు ఆదాయం గడించి వచ్చిన దాంతో జీవించే కష్ట జీవులు ఇప్పుడు అన్నం లభించక అలమటిస్తున్నారు. పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్టులు ఆగిపోయాయి. దీం తో దినసరి కూలీల పరిస్థితి దారుణాతిదారుణంగా తయారైంది. ఈ సమయంలో వారిని ఎవరు ఆదుకుంటారు? ఈ సమయంలో వారి కడుపు ఎలా నిండుతుంది? ఈ ప్రశ్నల నుంచే మనుషుల మనసులు బయటకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా ఆచితూచి ఖర్చు పెట్టిన వారు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు. కోట్ల రూపాయలను ప్రజలకు అందిస్తున్నారు. ఆపన్న వర్గాలకు పట్టెడు అన్నం పెట్టేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు వస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏకంగా పీఎం కేర్స్ ఫండ్ అనే బ్యాంకు అకౌంట్‌నే ప్రారంభించింది. మన రాష్ట్రం విషయానికి వస్తే.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళా లు ఇవ్వాలని నేరుగా సీఎం జగన్ ప్రజలను కోరారు. ఈ క్రమంలోనే ఎంపీ గల్లా జయదేవ్ నేతృత్వంలోని అమరరాజా గ్రూప్ రూ.6 కోట్ల మొ త్తాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.5 కోట్లు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చింది. తిరుపతిలో స్థిరపడ్డ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వర్షిణి ఇండస్ర్టీస్ ఎండీ శ్రీనివాస్ రూ.1.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర ఎన్జీవో ఉద్యోగులు 100 కోట్ల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. రూ.316 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు ఓఎన్జీసీ అసెట్ పీఆర్వో ఆక్ర తా భాటియా చెప్పారు.
ఇక, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తాను డైరక్టర్‌గా ఉన్న సంగం డెయిరీ తరఫున రూ.50 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. రాజధాని ఐనవోలు పరిధిలోని వెల్లూరు ఇనిస్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ(వీఐటీ) రూ.25 లక్షలు అందజేసింది. 200 పడకలున్న వర్సిటీ భవనాన్ని క్వారంటైన్ కేంద్రంగా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎన్.జీ.రంగా వ ర్సిటీ ఉద్యోగులు ఒకరోజు వేతనం(42లక్షలు) విరాళంగా ఇచ్చారు. పీఎం కేర్స్‌కి ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ రూ.27.5 లక్షల విరాళం అందించారు. సింబియోసిస్ టెక్నాలజీ తరఫున నరేశ్‌కుమార్ రూ.10 లక్షలు, సాగి కాశీ విశ్వనాథరాజు రూ.10 లక్షలు, పారిశ్రామికవేత్త రఘువర్మ రూ.5 లక్షలు, శ్రావణ్ షిప్పింగ్ తరఫున సాంబశివరావు రూ.లక్ష అందించారు. ఇలా కరోనా ఎఫెక్ట్ తో అందరూ కలివిడి గా ఆపన్నులను ఆదుకునేందుకు ముందుకు వస్తుండడం గమనార్హం.